మూడేళ్లలో 55 కోట్ల మంది నెటిజన్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య 2018 నాటికల్లా 55 కోట్ల స్థాయికి చేరుకోనుందని కన్సల్టెన్సీ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఒక నివేదికలో వెల్లడించింది. నెట్ వినియోగంపై అవగాహన పెరుగుతుండటం, అందుబాటు రేట్లలో ఇంటర్నెట్ లభిస్తుండటం ఇందుకు తోడ్పడనుంది. 2014లో నెటిజన్ల సంఖ్య 19 కోట్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 13 కోట్ల నుంచి 30 కోట్లకు పెరగగలదని బీసీజీ పేర్కొంది.
నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 40% మేర పెరిగే అవకాశం ఉందని వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో గతేడాది 6 కోట్లుగా ఉన్న నెటిజన్ల సంఖ్య 2018 నాటికి 28 కోట్లకు పెరగొచ్చని పేర్కొంది. నెట్ వాడకానికి అనువైన పరికరాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నెట్‌వర్క్ లభ్యత కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉంటుందని వివరించింది. భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో మూడింట రెండొంతుల ఇంటర్నెట్‌కి అనువైనవేనని బీసీజీ తెలిపింది. అయితే అత్యంత చౌకైన వాటి రేట్లు కూడా 60 డాలర్ల పైనే ఉంటున్నాయని, వీటి రేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉందని వివరించింది.