అబుదాబి ఆయిల్ కంపెనీతో ఒప్పందానికి ఓకే..
చమురు నిల్వ, నిర్వహణకు సంబం ధించి ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ (ఐఎస్‌పీఆర్‌ఎల్).. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఒప్పందం ప్రకారం మంగళూరు (కర్ణాటక)లోని ఐఎస్‌పీఆర్‌ఎల్ స్టోరేజి కేంద్రంలో 58,60,000 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను నిల్వ చేస్తుంది. ఇందులో సింహ భాగం వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనుండగా..
కొంత భాగాన్ని ఏడీఎన్‌వోసీ స్వంత వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకుంటుంది. ఈ ఒప్పందంతో భారత ఇంధన భద్రతకు మరింత తోడ్పాటు లభించగలదని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులపై అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ (హెచ్‌ఎల్‌టీఎఫ్‌ఐ) కింద యూఏఈ సంస్థతో కుదుర్చుకున్న అత్యంత భారీ పెట్టుబడి ఒప్పందం ఇదే. అలాగే, ఇంధన రంగంలో ఒక గల్ఫ్ దేశం ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.