
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 95 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.109 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.208 కోట్లకు పెరిగిందని ఆదిత్య బిర్లా క్యాపిటల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,353 కోట్ల నుంచి రూ.4,203 కోట్లకు ఎగసిందని వివరించింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.573 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం వృద్ధితో రూ.824 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.11,071 కోట్ల నుంచి 13,428 కోట్లకు పెరిగిందని వివరించింది. రుణాలు 32 శాతం వృద్ధితో రూ.51,378 కోట్లకు ఎగిశాయని వివరించింది.
కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ రూ.3,500 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపింది. ఈక్విటీ షేర్లు, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు, నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్‌సీడీ)ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేర్ 1.4 శాతం లాభంతో రూ.160 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment