న్యూఢిల్లీ: అధిక వేగంతో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే దిశగా కేంద్రం చర్యలు మొదలెట్టింది. అన్ని రకాల కార్లలో 2019 జూలై 1 నుంచి ఎయిర్ బ్యాగులతో పాటు, కారు వేగం పరిమితి దాటితే హెచ్చరించే ఏర్పాట్లు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్ల ధరలు కూడా 8–10 శాతం వరకు పెరగవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, కార్లలో సీటు బెల్ట్ ధరించకపోయినా గుర్తు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌కు మాన్యువల్‌గా ఓవర్‌రైడ్ స్విచ్ తదితర వాటినీ అమర్చాలి. వాస్తవానికి కొంచెం ఖరీదైన కార్లలో ఈ ఫీచర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే. అయితే, ఇప్పటి వరకు ఇవి తప్పనిసరి కాదు. 2019 జూలై నుంచి అన్ని కార్లలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. యూరోపియన్ యూనియన్ ప్రమాణాలకు అనుగుణంగా నూతన భద్రతా ప్రమాణాలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2020 అక్టోబర్ మధ్య దశల వారీగా అమల్లోకి రానున్నాయి.
ఇందులో ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్‌కు సంబంధించిన ప్రమాణాలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతమున్న కార్లలో ఇందుకు తగ్గ ఏర్పాట్లను వచ్చే ఏడాది అక్టోబర్ 1 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, అందుకు అనువైన వ్యవస్థలను అమర్చాలంటే ఒక్కో కారుకు ఎంత లేదన్నా కనీసం రూ.40,000–60,000 వరకు అదనపు ఖర్చు అవుతుందని విశ్లేషకులు, ఈ రంగానికి చెందిన వారు పేర్కొంటున్నారు.
మారుతి ముందుగానే...
దేశీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో సగం వాటా కలిగిన మారుతి సుజుకి ఇండియా ఈ విషయంలో ముందంజలోనే ఉంది. ఎస్‌క్రాస్, సియాజ్, బాలెనో, ఎర్టిగా, ఇగ్నిస్, న్యూ డిజైర్, సెలెరియో మోడళ్లు అత్యాధునిక భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి.
ఈ మేరకు ధ్రువీకరణ కూడా లభించింది. మారుతి సుజుకి ఇండియా పోర్ట్‌ఫోలియోలో 75–80% కార్లు ఈ నిబంధనలకు సరితూగుతున్నవి కావడం గమనార్హం. ఎయిర్‌బ్యాగులు, వేగ హెచ్చరికల వంటి ఫీచర్లను చాలా మోడళ్లలో మారుతి ఇప్పటికే అందిస్తోంది. ఇతర కార్ల కంపెనీలు కూడా నిబంధనల అమలుకు సిద్ధంగానే ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉండటమే కారణం. టయోటా కూడా మారుతి మాదిరిగానే డ్రైవర్, సహ ప్రయాణికులకు ఎయిర్‌బ్యాగులను ఆఫర్ చేస్తోంది.
కంపెనీల సంసిద్ధత: ప్రభుత్వ నిర్ణయాన్ని టయోటా స్వాగతించింది. సరైన దిశగా వేసిన అడుగుగా దీన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అభివర్ణించారు. ప్రమాదంలో కారు ముందుభాగంలో ప్రభావాన్ని అంచనా వేసే పరీక్షల విషయంలోనూ మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇది గంటకు 64 కిలోమీటర్ల వేగం స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండగా, మన దేశంలో అది 56 కిలోమీటర్ల వద్దే ఉన్నట్టు తెలిపారు.
నిబంధనల అమలు విషయంలో ఎటువంటి సమస్యల్లేవని హోండా కార్స్ సైతం స్పష్టం చేసింది. నిబంధనల అమలుకు కార్ల తయారీదారులు సిద్ధమేనని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్‌సేన్ పేర్కొన్నారు. ఇంకా ఏడాదికిపైగా సమయం ఉందన్నారు. అయితే కార్లలో భద్రతా వ్యవస్థలైన ఎయిర్‌బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటితోనే భద్రత వచ్చేస్తుందన్నది తప్పుడు అభిప్రాయమని కంపెనీలు చెబుతున్నాయి.
సౌకర్యాలతోనే భద్రత సాధ్యం కాదు...
‘‘నూతన వ్యవస్థలను ఏర్పాటువల్ల కార్ల బరువు గణనీయంగా పెరగబోదని ఇంజనీర్లు నిర్ధారించాలి. లేదంటే అధిక బరువు కారణంగా ఇంధన సామర్థ్యం, పనితీరు తగ్గిపోతాయి కస్టమర్లకు ఇవే ముఖ్యమైనవి. అన్ని అంశాలను సమతుల్యం చేయడమే సవాలు. మరణాలను తగ్గించడానికి కారును భద్రంగా మార్చడం ఒక్కటే సరిపోదు’’ అని మారుతి సీనియర్ ఈడీ సీవీ రామన్ వివరించారు.
♦ మన దేశంలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో 2020 నాటికి ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలన్నది లక్ష్యం.
♦ కార్లలో వేగ హెచ్చరికలను ఏర్పాటు చేస్తే కారు 80 కిలోమీటర్ల వేగం దాటిన వెంటనే ఆడియో రూపంలో హెచ్చరికలు వినిపిస్తాయి. అయినా డ్రైవర్ పట్టించుకోకుండా వేగాన్ని గనుక పెంచితే 100 కిలోమీటర్లు దాటిన వెంటనే హెచ్చరికలు మరింత పెద్దగా వినిపిస్తాయి. 120 కిలోమీటర్లు దాటిపోతుంటే సందేశాలు ఆగకుండా వస్తూనే ఉంటాయి.
♦ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే దాన్ని ధరించాలంటూ అలార్మ్ మోగుతుంటుంది. సీట్ బెల్ట్ ధరించిన తర్వాతే అది ఆగిపోతుంది. మాన్యువల్‌గా దాన్ని ఆఫ్ చేయడానికి అవకాశం ఉండదు.
♦ కార్లను వెనక్కి తిప్పే సమయంలో సెన్సార్ల వల్ల కారుకు ఏవైనా అడ్డుగా ఉంటే ఆ విషయం డ్రైవర్‌కు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment