లక్ష డాలర్ల కారు తుక్కుతుక్కు
ఇంటిలో ఎలుకలున్నాయని ఇంటిని తగలబెట్టుకున్నట్టు అనిపించినా... అమెరికాలో ప్రభుత్వాధికారులు రూల్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారో నిరూపిస్తోంది ఈ ఉదంతం. డబ్బు తీసుకునో, డబ్బును దృష్టిలో పెట్టుకునో అక్కడ రూల్స్‌ను మార్చడాలు, రూల్స్‌ను పట్టించుకోకపోవడాలూ ఏమీ ఉండవని నిరూపిస్తోంది ఈ సంఘటన.
ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో లక్ష డాలర్ల విలువజేసే వాహనాన్ని నిలువునా నాశనం చేసి పెట్టారు! మరోసారి ఇంకెవరూ ఇలాంటి పనులకు పూనుకోకుండా తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. అత్యవసర సమయాల్లో రక్షణగా ఉండే ఎయిర్ బ్యాగ్‌లు లేకుండా వాహనాలు తయారు కాకూడదు, తయారైనా.. వాటిని ఎవరూ వినియోగించకూడదనేది అమెరికాలో వాహనాలకు సంబంధించిన ఒక సేఫ్టీ లా. దీన్ని పట్టించుకోకుండా తయారై, రోడ్డుమీదకు వచ్చిన వాహనం పరిస్థితి ఇది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్- బండి మోడల్ పేరు ఇది. ధర లక్ష డాలర్లు. అంటే దాదాపు 65 లక్షల రూపాయలు. ఇంత ఖరీదైన వాహనాన్ని ‘ఎయిర్ బ్యాగులు లేవు’ అనే ఏకైక కారణం చెప్పి ధ్వంసం చేశారు యూఎస్ అధికారులు! కనీసం వంద కిలోమీటర్లు కూడా నడవని ఈ వాహనాన్ని సీజ్ చేసి, జేసీబీ సాయంతో తుక్కు చేశారు. మరి నిబంధనలను అతిక్రమించి.. అలాంటి వాహనాన్ని ఎలా ఉత్పత్తి చేశారు... అంటే ఇది అమెరికాలో తయారుచేసింది కాదు. బ్రిటన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాహనమిది.
అనుకోకుండా ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. అక్రమపద్ధతిలో దిగుమతి చేసుకున్న ప్రమాణాలకు తగ్గస్థాయిలో లేని ఈ వాహనాన్ని నాశనం చేసి... దానికి సంబంధించి ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేశారు పోలీసులు. ఇకపై ఎవరైనా ఇలా అక్రమంగా వాహనాలను దిగుమతి చేసుకుంటే ఇలాంటి పరిస్థితి తప్పదు... అనే హెచ్చరిక జారీ చేశారు. లక్షడాలర్లు ఖర్చు చేసి వాహనాన్ని కొని, ఇలా నాశనం చేయించుకునే ధైర్యం ఎవరికైనా ఉంటుందా?