
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశంలో ఎగురుతున్న విమానం చూసి అందులో మనమెప్పుడు ఎక్కుతామో... అనుకునే రోజులు పోయాయ్! ఇప్పుడు విమానం టికెట్ల ధరలు భారీగా తగ్గిపోయి...గతంతో పోలిస్తే చాలా చవకగానే దొరుకుతున్నాయి. ప్రయాణానికి కనీసం నెల రోజులు ముందు టికెట్లు బుక్ చేసుకున్న సందర్భాల్లో విమాన చార్జీలు ఫస్ట్, సెకండ్ క్లాస్ ఏసీ రైలు టికెట్ల కన్నా తక్కువకే లభిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ సంస్థల మధ్య పోటీ కారణంగా జరుగుతున్న ధరల యుద్ధం వల్ల సమాజంలోని చాలా వర్గాలకు విమానయోగం చేరువైపోయింది. ప్రధాన విమానాశ్రయాల మధ్య ఈ ధరల యుద్ధం పతాకస్థాయికి చేరింది. ధరలు భారీగా తగ్గడంతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. రానున్న నాలుగేళ్లలో మన దేశీయ ప్రయాణికుల సంఖ్యలో ఏటా 15 శాతానికి పైగా వృద్ధి ఉండనుందని అంతర్జాతీయ విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి.
రైలుకు సవాలు..
సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ. 665, థర్డ్ ఏసీ రూ. 1755, సెకండ్ ఏసీకి రూ. 2,555, ఫస్ట్ ఏసీకి రూ. 4,385. ప్రయాణ సమయం రైలు రకాన్ని బట్టి అటుఇటుగా 24 గంటల వరకు పడుతోంది. ఏసీ రైలు చార్జీలతో పోలిస్తే విమానయానమే చవకగా మారింది. విమానంలో ప్రయాణ సమయం రెండున్నర గంటలే. దీంతో రైళ్లలో చాంతాడంత ఉండే వెయిటింగ్ లిస్టు తగ్గిపోయింది. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య 9.54 కోట్ల మంది దేశీయంగా విమానయానం చేశారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే 17.30 శాతం ఎక్కువ. గడిచిన సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఏడు విమానయాన సంస్థలు 80 నుంచి 94.2 శాతం మధ్య ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్‌ను నమోదు చేశాయి.
దిగివచ్చిన విమానం...
ఢిల్లీ–హైదరాబాద్, ఢిల్లీ–ముంబై తదితర మార్గాల్లో ఇప్పుడు విమాన టికెట్లు ప్రయాణానికి కనీసం నెల ముందే కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2 వేలకే లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ సంస్థలిచ్చే క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లూ ఉన్నాయి. ఇండిగో, గో ఎయిర్ తదితర విమానయాన సంస్థల మధ్య పోటీయే ధరలు ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణం. చిన్న నగరాలకు కూడా కనెక్టివిటీ పెంచుతూ కొత్త సర్వీసులను కూడా సంస్థలు ప్రారంభిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరి తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరులకు కొత్త సర్వీసులను ఇండిగో ఎయిర్‌లైన్స్ తాజాగా ప్రారంభించింది. అలాగే ప్రాంతీయ విమాన సర్వీసులను చవకగా అందించేందుకు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం కూడా విమానాలకు కొత్త ప్రయాణికులను పరిచయం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment