ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లందరికీ సెకను ప్లాన్
న్యూఢిల్లీ: ఇకపై తమ ప్రీ-పెయిడ్ కస్టమర్లందరికీ పే-పర్-సెకన్ ప్లాన్లను వర్తింపచేయనున్నట్లు టెలికం సంస్థ భారత్ ఎయిర్‌టెల్ వెల్లడించింది. తద్వారా తమ నెట్‌వర్క్‌ను వినియోగించుకున్నంత సమయానికి మాత్రమే కస్టమర్లు చెల్లిం చినట్లవుతుందని పేర్కొంది. కాల్ అంతరాయాలు (కాల్ డ్రాప్స్) వల్ల కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయా అన్న కోణాన్ని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ పరిశీలిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాల్ డ్రాప్స్ పెరుగుతున్న నేపథ్యంలో నిమిషానికి లెక్కగట్టే చార్జీ ప్లాన్లను పరీక్షించాల్సివుందంటూ టెలికం కార్యదర్శి రాకేశ్ గార్గ్ ఇటీవల ప్రకటించారు. నిముషం ప్లాన్ ప్రకారం కొద్ది సెకన్లు మాట్లాడిన తర్వాత కాల్‌కు అంతరాయం ఏర్పడితే పూర్తి నిమిషానికి చార్జీ పడుతుంది. ఇలా కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయన్న అనుమానాల్ని అటు ట్రాయ్, ఇటు టెలికం శాఖ వ్యక్తంచేసిన తరువాత తాజాగా ఎయిర్‌టెల్ అన్ని కనెక్షన్లకు సెకనుకు లెక్కగట్టే ప్లాన్లను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. గత 3-4 నెలలుగా కాల్ డ్రాప్స్ సమస్య బాగా ఎక్కువయ్యింది. ప్రధాని మోదీ సైతం ఈ అంశంపై ఆందోళన వ్యక్తపర్చారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా.
2015 జూన్ నాటికి ఎయిర్‌టెల్ మొత్తం కస్టమర్లలో 94.4 శాతం మంది ప్రీ-పెయిడ్ వినియోగదారులే ఉన్నారు. సాధారణంగానే తమ ప్లాన్లలో సింహభాగం సెకను ఆధారితమైనవేనని, కాల్ డ్రాప్స్ వల్ల తమకు అదనపు ప్రయోజనం చేకూరదని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్ ఇటీవలే పేర్కొన్నారు. ప్రీ-పెయిడ్ వినియోగదారులందర్నీ పర్-సెకన్ ప్లాన్‌లోకి తీసుకొస్తున్నట్లు ఎయిర్‌టెల్ డెరైక్టర్ అజయ్ పూరి తెలిపారు.