‘అక్షయ’ అమ్మకాలపై అధిక ధరల ప్రభావం
♦ 11 శాతం పెరిగిన ధరలు
♦ 20-30 శాతం తగ్గనున్న అమ్మకాలు
ముంబై: అధిక ధరలు అక్షయ తృతీయ అమ్మకాలపై ప్రభావం చూపాయి. పుత్తడి ధరలు 11 శాతం పెరగడంతో గత ఏడాది కంటే అమ్మకాలు 20-30 శాతం వరకూ తగ్గవచ్చని పరిశ్రమ సంబంధిత కొన్ని సంఘాలు పేర్కొన్నాయి. వివిధ సంస్థలు భారీగా డిస్కౌంట్లు అఫర్ చేస్తున్నప్పటికీ, కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని సమాచారం. గత ఏడాది అక్షయ తృతీయ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.27,100గా ఉండగా, ఈ ఏడాది అక్షయ తృతీయ రోజు ధర రూ.30,100గా ఉంది.
ధరలు అధికంగా ఉండడంతో పాటు రూ.2 లక్షలకు మించిన బంగారు కొనుగోళ్లపై పాన్ నంబర్ తప్పనిసరిగా వెల్లడించాల్సిరావడం తదితర అంశాలు ఈ ఏడాది అమ్మకాలపై తీవ్రమైన ప్రభావమే చూపాయని గీతాంజలి గ్రూప్ సీఎండీ మెహుల్ చోక్సి చెప్పారు. అయితే అమ్మకాలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, విలువ పరంగా 10 శాతం వృద్ధి ఉందని పీసీ జ్యూయలర్ ఎండీ బలరామ్ గార్గ్ పేర్కొన్నారు. ధరలు పెరగడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈసారి డిమాండ్ 60 శాతం తగ్గిందని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఉన్నతాధికారొకరు వెల్లడించారు.