
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఈ రిటైల్ దిగ్గజం అమెజాన్ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్‌లో వాటా తీసుకోవడం దాదాపు ఖాయమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చర్చలు పురోగతికి చేరాయని, 3–4 వారాల్లో నిర్ణయం వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చలు పురోగతిలో ఉన్నాయని, రూ.2,000 కోట్లకు పైగా పెట్టుబడితో వాటా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి.
భారత మార్కెట్లో భారీ విస్తరణపై కన్నేసిన అమెజాన్ ఇప్పటికే షాపర్స్‌స్టాప్‌లోనూ కొంత వాటా తీసుకుంది. ఫ్యూచర్ గ్రూపుతో డీల్ ఖరారైతే... భారత రిటైల్ రంగంలో అమెజాన్‌కు ఇది మూడో పెట్టుబడి అవుతుంది. గతేడాది షాపర్స్ స్టాప్ అమెజాన్‌కు ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ రూపంలో జారీ చేసి రూ.179.26 కోట్లను సమీకరించింది. దీంతో షాపర్స్ స్టాప్‌లో అమెజాన్‌కు 5 శాతం వాటా దక్కింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో విట్‌జిగ్ అడ్వైజరీ సర్వీసెస్‌తో కలసి ఆదిత్య బిర్లా రిటైల్‌కు చెందిన ‘మోర్’ను అమెజాన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్‌లైన్ రిటైలర్ల ఆధిపత్యం కలిగిన భారత రిటైల్ మార్కెట్లో బలపడేందుకు అమెజాన్‌కు తాజా డీల్ ఉపయోగపడుతుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు, భారత రిటైల్ మార్కెట్లో వాల్ మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మధ్య పోటీ మరింత తీవ్రతరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment