న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ స్వాధీనం చేసుకున్న స్టోర్లను తిరిగి పొందడానికి అలాగే ఇందుకు సంబంధించి విలువల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్) ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ అనూహ్య చర్య తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపార కార్యకలాపాలను .. రూ. 24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్‌కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో స్వల్ప వాటాల వల్ల, పరోక్షంగా రిటైల్ విభాగాల్లోను వాటాదారుగా మారానంటూ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ డీల్‌ను అడ్డుకుంటోంది. దీనిపై ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య న్యాయ వివాదం నడుస్తోంది.
వివాదానికి కారణమైన ‘అమెజాన్ ఫ్యూచర్ కూపన్స్’ ఒప్పందమే చెల్లదని 2021 డిసెంబర్ కాంపిటేషన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూలింగ్‌తో సమస్య కొత్త మలుపు తిరిగింది. ఇక, ఫ్యూచర్ గ్రూప్‌నకు 1,700 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా లీజు అద్దెలను కొన్నాళ్లుగా ఫ్యూచర్ గ్రూప్ చెల్లించలేకపోతోంది. ఇవన్నీ మూతబడే పరిస్థితి నెలకొనడంతో వీటిలో కొన్ని స్టోర్స్ లీజును రిలయన్స్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)కు బదలాయించుకుని, వాటిని ఫ్యూచర్‌కు సబ్–లీజుకు ఇచ్చింది. సరఫరాదారులకు సైతం ఫ్యూచర్ చెల్లింపులు జరపలేకపోతుండటంతో ఆయా స్టోర్స్‌కు అవసరమైన ఉత్పత్తులను కూడా రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. దీంతో సదరు స్టోర్స్‌లో అధిక భాగం ఉత్పత్తులు రిలయన్స్‌వే ఉన్నాయి. సబ్–లీజు బాకీలను ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు కట్టలేకపోవడం వల్ల, సబ్ లీజులను రద్దుచేసి రిలయన్స్ ఆ అవుట్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకుని, రీబ్రాండింగ్ చేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్చూచర్ తాజా ప్రకటన చేసింది.
ఆర్బిట్రేషన్ పునరుద్ధరణపై మార్చి 23న సుప్రీం విచారణ
కాగా వివాదంపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ పునఃప్రారంభాన్ని కోరుతూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది. ఆర్బిట్రేషన్ విచారణను పునఃప్రారంభించాలని కోరడంతో పాటు, ఆర్బిట్రేషన్‌లో గెలిస్తే ఫ్యూచర్ ఆస్తులు తమ వద్దే ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అమెజాన్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment