న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్వాగతించారు. భారత ప్రజలంతా కశ్మీరీలను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకోవాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ కొన్ని నిర్ణయాల గురించి తెలుసుకున్నపుడు.. ఇలాంటి నిర్ణయాలు ఇంతకుముందే తీసుకుని ఉంటే బాగుండేది. అసలు అలా ఎందుకు జరగలేదు అని అనిపిస్తుంది. ఈరోజు(సోమవారం) తీసుకున్న నిర్ణయం కూడా అలాంటి కోవకు చెందినదే. జాతీయ వర్గంలోకి చేరిన కశ్మీరీలను ఏ మాత్రం సంకోచం లేకుండా.. పూర్తిగా మనవారు అయ్యారనే భావనతో ఆత్మీయంగా హత్తుకోవాల్సిన సమయం ఇది’ అని మహీంద్ర గ్రూప్ అధినేత ట్వీట్ చేశారు.
There are some decisions, which when taken, evoke the reaction “Why couldn’t this have happened earlier?” Today’s decision falls in that category. It’s time for us all to embrace Kashmiris as an indistinguishable & inseparable part of our national community.
— anand mahindra (@anandmahindra) August 5, 2019
కాగా సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు జరిగిన పరిణామాలపై కూడా తనదైన శైలిలో స్పందించారు. ‘ఇది కేవలం మరో సోమవారపు ఉదయం మాత్రమే అనుకోవద్దు. కశ్మీర్ కేంద్ర నిర్ణయంపై యావత్ దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కశ్మీర్‌లో అందరూ సురక్షితంగా ఉండాలని.. దేశ పటిష్టత, భవిష్యత్‌ను ఇనుమడింపచేసే నిర్ణయం వెలువడాలని మనం ప్రార్ధించాలి’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఆర్టికల్ 370 రద్దు విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా.. కశ్మీర్ కూడా మనదే’ అంటూ కొంతమంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా... ‘స్టాండ్ విత్ కశ్మీర్’ అంటూ మరికొంత మంది బీజేపీ సర్కారు తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అక్కడ రెండు టులిప్ తోటలు ఉండేవి
ఇక ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ పలువురు పారిశ్రామిక వేత్తలు మోదీ సర్కారుకు అండగా నిలిచారు. కశ్మీర్‌లో తనకు రెండు టులిప్ తోటలు ఉండేవని, మిలిటరీ గ్రూపులు వాటిని ధ్వంసం చేశాయని.. కేంద్రం తాజా నిర్ణయంతో ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తబోవని ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. అదే విధంగా..‘ ఆర్టికల్ 370ను ఎప్పుడో రద్దు చేయాల్సింది. అయితే బీజేపీ సర్కారు సాహసోపేత చర్య ద్వారా ఇది సాధ్యమైంది’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక..ఆర్టికల్ 370 రద్దు ద్వారా కశ్మీర్‌లోకి పెట్టుబడులు వెల్లువలా వస్తాయని. తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment