ఆంధ్రా బ్యాంక్ లాభంలో భారీ క్షీణత
* క్యూ4లో రూ. 345 కోట్ల నుంచి రూ. 88 కోట్లకు తగ్గిన నికర లాభం
* భారీగా పెరిగిన ఎన్‌పీఏలు కారణం
* ఈ ఏడాది వ్యాపారంలో 20% వృద్ధి అంచనా
* త్వరలో సీమాంధ్రలో ప్రాంతీయ ప్రధాన కార్యాలయం
* తెలంగాణపై ప్రత్యేక దృష్టి ఆంధ్రాబ్యాంక్ ఈడీ ఎస్.కె.కల్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ మరో త్రైమాసికం నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికరలాభంలో 74 శాతం క్షీణత నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి రూ. 345 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 88 కోట్లకు పడిపోయింది. భారీగా పెరిగిన నిరర్థక ఆస్తులకు చేసిన కేటాయింపులే లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. అంతకుముందు ఏడాది రూ.355 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు రూ. 711కోట్లకు చేరడంతో లాభాలు తగ్గినట్లు ఆంధ్రాబ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఏడాది మొత్తం మీద చూస్తే ఆంధ్రాబ్యాంక్ నికరలాభం 66 శాతం క్షీణించి రూ.1,289 కోట్ల నుంచి రూ. 436 కోట్లకు తగ్గింది.
ఇదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు 3.71 శాతం నుంచి 5.29 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 2.45 శాతం నుంచి 3.11 శాతానికి పెరిగాయి. గత రెండు త్రైమాసికాల నుంచి నిరర్థక ఆస్తుల్లో తరుగుదల నమోదవుతోందని, మొండి బకాయిల రికవరీ కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది స్థూల నిరర్థక ఆస్తులను 4 శాతం దిగువకు తీసుకురాగలమన్న ధీమాను ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె.కల్రా వ్యక్తంచేశారు. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది రాష్ర్ట విభజన ఆందోళనతో సీమాంధ్రలో సుమారు నాలుగు నెలలు వ్యాపార కార్యకలాపాలు ఆగిపోవడం ఎన్‌పీఏలు పెరగడానికి కారణంగా పేర్కొన్నారు. గడచిన ఏడాది వ్యాపారంలో కేవలం 12 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందని, కాని ఈ సంవత్సరం 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.2.52 లక్షల కోట్లుగా ఉంది.
తెలంగాణపై దృష్టి
కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంపై అధికంగా దృష్టిసారించనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. సీమాంధ్రతో పోలిస్తే తెలంగాణలో వెనుకబడి ఉండటంతో ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి శాఖల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు కల్రా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1250 శాఖలను ఆంధ్రాబ్యాంక్ కలిగిఉంటే సీమాంధ్రలో 780, తెలంగాణలో 470 శాఖలు వున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో మరో 250 శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందులో అత్యధికంగా తెలంగాణకు కేటాయించనున్నట్లు కల్రా వివరించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్ణయం అయిన తర్వాత అక్కడొక ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి లీడ్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రాబ్యాంక్ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అదే హోదాను కొనసాగించాలని యోచిస్తోంది. బ్యాంకు శాఖల పరంగా తెలంగాణలో ఎస్‌బీహెచ్ కంటే వెనుకబడి ఉండటంతో ఆంధ్రాబ్యాంక్‌కు లీడ్‌బ్యాంక్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీనిపై స్పందిస్తూ తెలంగాణలో కూడా ఎస్‌ఎల్‌బీసీగా ఉండటానికి ప్రయత్నం చేస్తామన్నారు.