సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–డివిజన్ వన్డే లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆసాంతం మెరుగ్గా రాణించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తుదిమెట్టుపై బోల్తా పడింది. బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమవడంతో ఆదివారం ఆంధ్రా బ్యాంక్‌తో జరిగిన ఫైనల్లో ఎస్‌బీఐ 152 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రా బ్యాంక్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 310 పరుగుల భారీస్కోరు సాధించింది. పీఎస్ చైతన్య రెడ్డి (93 బంతుల్లో 107; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. నీరజ్ బిష్త్ (44 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచాడు.
29 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 72 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నీరజ్ పెవిలియన్ చేరాక అభినవ్ కుమార్ (14)తో నాలుగో వికెట్‌కు 29 పరుగులు, టి. రవితేజ (37; 2 ఫోర్లు)తో కలిసి 89 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి చైతన్య ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 246/5. తర్వాత ఆశిష్ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్), ఖాదిర్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్ భండారి, టి. సుమన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఎస్‌బీఐ జట్టు 33.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సయ్యద్ అహ్మద్ ఖాద్రి (34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్లు టి. సుమన్ (9), డానీ ప్రిన్స్ (17), అనూప్ పాయ్ (6), బి. సుమంత్ (0), ఆకాశ్ భండారి (16), అనిరుధ్ సింగ్ (18), కేఎస్‌కే చైతన్య (22; 4 ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఆంధ్రా బ్యాంక్ బౌలర్లలో టి.రవితేజ, అమోల్ షిండే, నీరజ్ బిష్త్ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు., , ,
Comments
Please login to add a commentAdd a comment