ఆంధ్రాబ్యాంక్ లాభం రెట్టింపు
103% వృద్ధితో రూ. 144 కోట్లు
వ్యవసాయ రుణాల్లో ఎన్‌పీఏలు తగ్గడమే కారణం
ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 103 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 71 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 144 కోట్లకు చేరింది. ఇదే సమయంలో వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 3,592 కోట్ల నుంచి రూ. 4,146 కోట్లుగా నమోదయ్యింది.
వడ్డీ లాభదాయకత పెరగడంతో పాటు, తొలి త్రైమాసికంలో వ్యవసాయ రుణాల ఎన్‌పీఏల కోసం కేటాయించిన రూ. 392 కోట్ల ప్రొవిజనింగ్స్‌లో రూ. 75 కోట్లు వెనక్కి రావడం లాభాలు పెరగడానికి కారణంగా ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్.రాజేంద్రన్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో రుణ మాఫీపై స్పష్టత రావడంతో కొత్తగా ఎటువంటి ఎన్‌పీఏలు ఏర్పడలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 25 శాతం నిధులను మంజూరు చేసిందని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కూడా నిధులు విడుదల చేయనుండటంతో వచ్చే త్రైమాసికంలో రూ. 200 కోట్ల వడ్డీ ఆదాయం వెనక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంకా ఇన్‌ఫ్రా, విద్యుత్, ఉక్కు రంగాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, దీంతో ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ. 900 కోట్ల నికర లాభాన్ని చేరుకోగలమన్న ధీమాను వ్యక్తం చేశారు.
వడ్డీ లాభదాయకతను పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందుకోసం వచ్చే ఆరు నెలల్లో డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని 0.25% తగ్గించి, రుణాలపై వడ్డీ ఆదాయాన్ని 0.3% పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా కాలంలో మొత్తం వ్యాపారం 13 శాతం వృద్ధి చెంది రూ. 2.60 లక్షల కోట్లకు చేరుకుంది.
స్వల్పంగా పెరిగిన నిరర్థక ఆస్తులు
సమీక్షా కాలంలో నిరర్థక ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది రూ. 5,187 కోట్లు (5.15%)గా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది రూ. 6,884 కోట్ల(5.99%)కు పెరిగాయి. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు రూ.3,477 కోట్లు(3.54%) నుంచి రూ. 4,315 కోట్ల (3.86%)కు చేరాయి. ఈ ఏడాది వ్యాపార అవసరాల కోసం రూ. 800 కోట్ల మూలధనం అవసరమవుతుందని, దీన్ని కేంద్రం సమకూరుస్తుందని భావిస్తున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. డిసెంబర్‌లోగా టైర్-1 బాండ్స్ ద్వారా గరిష్టంగా రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు.
వైజాగ్‌లో రూ.5,000 కోట్ల రుణాలు
తుపాన్ వల్ల దెబ్బతిన్న వైజాగ్ చుట్టుపక్కల సుమారు రూ.5,000 కోట్ల రుణాలను ఇచ్చినట్లు ఆంధ్రాబ్యాంక్ తెలిపింది. ఇందులో సుమారు రూ.1,800 కోట్లు వ్యవసాయ రుణాలు కాగా మిగిలినవి ఎస్‌ఎంఈ, ఇతర వ్యాపారాలకు సంబంధించినవన్నారు. ఈ రుణాల చెల్లింపులపై ఆర్‌బీఐతో సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు రాజేంద్రన్ తెలిపారు.