వచ్చే ఏడాది మార్చికల్లా టైటన్ ఐ ప్లస్ మరో ప్లాంట్ | Another titan eye plus plant in next year march | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది మార్చికల్లా టైటన్ ఐ ప్లస్ మరో ప్లాంట్

Published Fri, Mar 28 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

వచ్చే ఏడాది మార్చికల్లా  టైటన్ ఐ ప్లస్ మరో ప్లాంట్

వచ్చే ఏడాది మార్చికల్లా టైటన్ ఐ ప్లస్ మరో ప్లాంట్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కళ్లద్దాల వ్యాపారంలో ఉన్న టైటన్ ఐ ప్లస్ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఉత్తరాది లేదా తూర్పు భారత్‌లో 2015 మార్చికల్లా అందుబాటులోకి తేవాలని చూస్తోంది. ఏటా 7.5 లక్షల లెన్సుల తయారీ సామర్థ్యంతో ప్లాంటు రానుందని టైటన్ ఐవేర్ బిజినెస్ సీఈవో ఎస్.రవికాంత్ గురువారమిక్కడ తెలిపారు. హైదరాబాద్‌లో 14వ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత ప్లాంటుకు నిధులు ఎంత వెచ్చించేది ఇంకా ఖరారు కాలేదన్నారు.

 కంపెనీకి బెంగళూరు సమీపంలో ఏటా 5 లక్షల లెన్సుల తయారీ సామర్థ్యమున్న కేంద్రం ఉంది. దీనికి సుమారు రూ.15 కోట్లు వెచ్చించింది. ఈ కేంద్రంలో ఖరీదైన లెన్సులను తయారు చేస్తోంది. ఫ్రేమ్‌లను దిగుమతి చేసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 278 టైటన్ ఐ ప్లస్ స్టోర్లలో జరుగుతున్న అమ్మకాల్లో 40% తమ సొంత బ్రాండ్లని, మిగిలినవి ఇతర కంపెనీల ఉత్పత్తులను వివరించారు.


 స్టోర్ల విస్తరణ..: 2014-15లో మరో 60 స్టోర్లను టైటన్ ఐ ప్లస్ ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు స్టోర్లు రానున్నాయని, మరో 8 చిన్న పట్టణాల్లో ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు టైటన్ దక్షిణ ప్రాంత బిజినెస్ హెడ్ సుపర్ణ మిత్ర తెలిపారు. సన్ గ్లాసెస్‌తోసహా రెండు సొంత బ్రాండ్లను కంపెనీ వారంలో పరిచయం చేస్తోంది. లెన్సుల(కటకం) పరంగా చూస్తే ప్లాస్టిక్‌వి 70% కైవసం చేసుకున్నాయి. వీటి ఖరీదు చాలా తక్కువ.  అతినీలలోహిత కిరణాలను నూరు శాతం అడ్డుకునే పాలీకార్బొనేటెడ్, ట్రైవెక్స్ లెన్సుల వాటా 30 శాతమని టైటన్ ఐ ప్లస్ ఆంధ్రప్రదేశ్ హెడ్ వి.శ్రీకాంత్ తెలిపారు. ప్లాస్టిక్ లెన్సులతో పోలిస్తే ఇవి బరువు తక్కువ. కాగా, కళ్లద్దాల మార్కెట్ భారత్‌లో 16% వృద్ధితో రూ.3,500-3,800 కోట్లుంది. వ్యవస్థీకృత రంగ పరిమాణం 30 శాతం.

Advertisement

పోల్

Advertisement