న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్టయిన కంపెనీలు మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల్ని పాటించాలని, ఇన్వెస్టర్ల అప్రమత్తత పెరిగిన నేపథ్యంలో కార్పొరేట్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని, కఠినమైన డిస్‌క్లోజర్ నిబంధనల్ని పాటించాలని పారిశ్రామిక సంఘాల సమాఖ్య అసోచామ్ సూచించింది. కార్పొరేట్ గవర్నెన్స్ పాటించని కార్పొరేట్లను స్టాక్ మార్కెట్ ఇటీవలికాలంలో తీవ్రంగా శిక్షిస్తున్నదని, షేర్‌హోల్డర్ల విలువను పెంచడంపైన ప్రమోటర్లు దృష్టినిలపాలని ఆదివారంనాడు అసోచామ్ విడుదల చేసిన ప్రకటనలో కోరింది.
ఎలాంటి ప్రమాణాలు పాటించినా చెల్లుబాటవుతుందనుకునే ప్రమోటర్ల గత పద్దతులకు కాలం చెల్లిందని, ఇన్వెస్టర్ల అవగాహన, అప్రమత్తత పెరగడం ఇందుకు కారణమని, తెలిసి జరిగినా, తెలియక జరిగినా, అవకతవకల్ని ఇన్వెస్టర్లు క్షమించడం లేదని అసోచామ్ హెచ్చరించింది. ఇటీవల కొన్ని కంపెనీల అనుమానాస్పద లావాదేవీల కారణంగా వాటి షేర్ల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనై, ఇన్వెస్టర్ల సంపదను హరించివేసిన వైనాన్ని అసోచామ్ గుర్తుచేసింది.
మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ విస్తరించిన నేపథ్యంలో చిన్న పొరపాటు కన్పించినా, అవకతవకగా అన్పించినా, షేరు ధర నిలువునా పతనమై, సంపద హరించుకుపోతున్నందున...కార్పొరేట్లు అత్యంత జాగరూకతతో వుండాలని అంతర్జాతీయ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించాలని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment