
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, మొబైల్ ఫోన్ నంబర్లు ఇతరత్రా అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు పోస్టాఫీస్‌లకూ దీన్ని వర్తింపజేసింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాలతో పాటు పోస్టాఫీసుల్లోని అన్ని రకాల డిపాజిట్ పథకాలు, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్ వికాస్ పత్రాలకు కూడా ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.
ఖాతాదారులు ఇకపై ఆయా పథకాలు, డిపాజిట్ దరఖాస్తులకు ఆధార్‌ను జతచేయాల్సి ఉంటుం దని ప్రభుత్వం గతనెల 29న జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అదేవిధంగా ఇప్పటిదాకా పోస్టాఫీస్ పథకాలకు సంబంధించి ఆధార్‌ను తమ దరఖాస్తుల్లో వెల్లడించని ప్రస్తుత డిపాజిటర్లకు ఆధార్ కాపీని సమర్పించేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
నల్లధనం, బినామీ లావాదేవీలకు చెక్‌పెట్టేందుకు, సబ్సిడీ ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులకు చేర్చేందుకే ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. కాగా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందాలాంటే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ఆధార్‌ను తీసుకోవాలంటూ కేంద్రం ఇటీవలే గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అంతక్రితం ఈ గడువు సెప్టెంబర్ 30 వరకూ ఉంది. అప్పటివరకూ లబ్ధిదారులకు సేవలను కొనసాగించాలని, తిరస్కరించవద్దని కూడా ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment