సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు రెండు వారాల ముందు శుక్రవారం జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడతాయని భావిస్తున్నారు. నిర్మాణ, ఆటోమొబైల్ రంగాలకు ఊతమిచ్చేలా ఆటోమొబైల్, సిమెంట్ రంగాలపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కారణంగా ఆటో పరిశ్రమకు జీఎస్టీ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు.
అదేతరహాలో సిమెంట్ పరిశ్రమ సైతం జీఎస్టీ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్య ప్రస్తుతం నిస్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెస్తుందని భావిస్తున్నారు. కాగా సిమెంట్ రంగంపై పన్ను రేట్లను 18 శాతానికి తగ్గిస్తే ప్రభుత్వ ఖజానాకు రూ 12,000 నుంచి రూ 14000 కోట్ల వరకూ ఆదాయ నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు భారీ కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు రూ 50 కోట్ల పైబడిన లావాదేవీలకు ఈ-ఇన్వాయిసింగ్‌ను తప్పనిసరి చేయడంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులు, సేవలను తక్కువ పన్ను శ్లాబ్‌ల్లోకి తీసుకురావడంపైనా ప్రధానంగా చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment