
ఇక మార్కెట్లోకి బీఎస్–ఫోర్ వాహనాలు
న్యూఢిల్లీ: భారత్ స్టేజ్ ఫోర్ (బీఎస్–ఫోర్) పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఉండే వాహనాలను అందించడానికి వాహన పరిశ్రమ సిద్దంగా ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) పేర్కొంది. బీఎస్–ఫోర్ పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువును పొడిగించాలని వాహన పరిశ్రమ కోరడం లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి చెప్పారు. గడువును పొడిగింపునకు వాహన పరిశ్రమ ప్రయత్నిస్తోందంటూ కొందరు పర్యావరణ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. యూరో–ఫోర్ నిబంధనలను అమలు చేయడానికి యూరప్‌కు 13 ఏళ్లు పట్టిందని, కానీ, బీఎస్–ఫోర్ నిబంధనలను అమలు చేయడానికి భారత వాహన పరిశ్రమకు పదేళ్లే పట్టాయని వినోద్ వివరించారు.