నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
• పాల్గొంటున్న 10 లక్షల మంది సిబ్బంది
• దాదాపు 80 వేల శాఖలు బంద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు మొదలైన వాటిని వ్యతిరేకిస్తూ బ్యాంకుల ఉద్యోగులు దేశవ్యాప్తంగా నేడు (శుక్రవారం) సమ్మెకు దిగనున్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు మొత్తం 40 పైగా ప్రభుత్వ రంగ, పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఆయా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర కొత్త తరం బ్యాంకులు యథాప్రకారం పనిచేస్తాయి.
కీలకమైన తొమ్మిది యూనియన్లలో సభ్యత్వమున్నవారంతా సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు తెలిపారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 80,000 పైచిలుకు శాఖల్లోని ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు’ అని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా బ్యాంకింగ్ రంగంలో నిర్హేతుక సంస్కరణల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాంబాబు విమర్శించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో అయిదు బ్యాంకుల విలీనాన్ని (ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్) ఆయా బ్యాంకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మొదలైన వాటిని కూడా వ్యతిరేకిస్తూ యూనియన్లు ఈ నెల 12, 13న రెండు రోజుల స్ట్రయిక్ తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా దాన్ని వాయిదా వేసుకున్నాయి. తాజాగా ఈ నెల 29న (నేడు) సమ్మె నిర్వహిస్తున్నాయి.
అసంబద్ధ సంస్కరణలొద్దు ..
మరోవైపు, పరిస్థితి తీవ్రతను అన్ని వర్గాల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే శుక్రవారం సమ్మె తలపెట్టినట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. వారాంతమైనప్పటికీ బ్యాంకులకు వరుస సెలవులు ఉండబోవని, శనివారం యథాప్రకారంగానే పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన అసంబద్ధ బ్యాంకింగ్ సంస్కరణలకు వ్యతిరేకంగానే ఈ సమ్మె తలపెట్టినట్లు చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలను 49 శాతం కన్నా తక్కువకి తగ్గించుకోవాలనే నిర్ణయాల ద్వారా దాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తోందని, ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఒకవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ.. మరోవైపు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలకి లెసైన్సులు ఇవ్వడం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగాన్ని సమూలంగా తుడిచిపెట్టేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అమలు చేస్తున్న సంస్కరణలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వెంకటాచలం పేర్కొన్నారు.
ఎగవేతదారులను శిక్షించాలి..
ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల భారం రూ. 5,39,995 కోట్లకు చేరిందని వెంకటాచలం తెలిపారు. డిఫాల్టర్లు ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన మొత్తాలు సుమారు రూ. 58,792 కోట్ల మేర ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం గానీ, రిజర్వ్ బ్యాంక్ గానీ మొండిబకాయిలను రాబట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని, కనీసం డిఫాల్టర్ల పేర్లను కూడా ప్రచురించడం లేదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులను ముంచెత్తుతున్న మొండి బకాయిలను రాబట్టేందుకు సరైన చర్యలు చేపట్టకపోగా ఎగవేతదారులు మొదలైన వారికి మినహాయింపులు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంకటాచలం విమర్శించారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను నేరస్తులుగా ప్రకటించి, కఠినంగా శిక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.