
దేశీ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్న రికవరీని పలువురు నిపుణులు బేర్ మార్కెట్ ర్యాలీగా అభివర్ణిస్తున్నారు. రెండో దశలో కరోనా వైరస్ విస్తరిస్తే పరిస్థితులు మరింత వికటించవచ్చునంటూ అంచనా వేస్తున్నారు. ఒకవేళ కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే స్టాక్ మార్కెట్లలో ‘వీ’షేప్ ర్యాలీకి చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశీ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవోఎఫ్‌ఏ) సెక్యూరిటీస్ ఈ నెల 7-14 మధ్య సర్వే చేపట్టింది. దీనిలో భాగంగా 223 మంది గ్లోబల్ ఫండ్ మేనేజర్లను ప్రశ్నించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 651 బిలియన్ డాలర్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగిన పలు ఫండ్ మేనేజర్ల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ వివరాలు చూద్దాం..
68 శాతం
ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్లలో బేర్ ర్యాలీ నెలకొన్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు వేగంగా బౌన్స్‌బ్యాక్ అయిన నేపథ్యంలో ఇది బుల్ ర్యాలీనే అంటూ 25 శాతం మంది పేర్కొన్నారు. రెండో దశలో మరోసారి కరోనా వైరస్ విస్తరిస్తే స్టాక్ మార్కెట్లకు షాక్ తగలవచ్చని 52 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరిగితే.. నిరుద్యోగం ప్రబలడం, యూరోపియన్ యూనియన్ చీలిపోవడం, రుణ మార్కెట్ దెబ్బతినడం వంటి రిస్కులు తలెత్తవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ వెలువడితే.. మార్కెట్లు వేగవంత రికవరీని సాధిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. కాగా.. మే నెలలో ఫండ్స్ వద్ద నగదు స్థాయిలు 5.7 శాతానికి చేరినట్లు సర్వే పేర్కొంది. ఫిబ్రవరిలో ఇవి 4 శాతంగా నమోదుకాగా.. ఏప్రిల్ కంటే స్వల్పంగా తక్కువని తెలియజేసింది.
భారీ పతనం
చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ యూరోప్, అమెరికాసహా పలు దేశాలకు పాకడంతో మార్చి నెలలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం విదితమే. 2019 చివర్లో ప్రారంభమైన కోవిడ్-19 సంక్షోభం ఈక్విటీలలో భారీ అమ్మకాలకు కారణమైంది. దీంతో చరిత్ర సృష్టిస్తున్న అమెరికన్ ఇండెక్సులు డోజోన్స్, ఎస్‌అండ్‌పీ.. 11 ఏళ్ల బుల్ రన్‌కు ఒక్కసారిగా చెక్ పడింది. దేశీయంగానూ సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీకి బ్రేక్ పడింది. అంతేకాకుండా సాంకేతికంగా బేర్ ట్రెండ్‌లోకి ప్రవేశించాయి కూడా. ఇండెక్సులు 20 శాతం పతనమైతే బేర్ దశగా భావించే సంగతి తెలిసిందే. అయితే వివిధ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ప్రకటించిన భారీ సహాయక ప్యాకేజీల కారణంగా ఏప్రిల్‌లో మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. ప్రధానంగా ఇటీవల హెడ్జ్ ఫండ్స్ ఈక్విటీలలో కొనుగోళ్లు చేపడుతున్నట్లు సర్వే పేర్కొంది. మే నెలకల్లా 34 శాతం లాంగ్ పొజిషన్లు తీసుకున్నట్లు తెలియజేసింది. 2018 జూన్ తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే స్వల్పంగా తక్కువని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment