న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్‌బీఐ కార్డు తమ యూజర్లను హెచ్చరించింది. వీటిలో ఇన్వెస్ట్ చేసేవారు క్రిప్టోకరెన్సీలతో ఉండే రిస్కులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. దేశీయంగా రెండో అతి పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డుకు దాదాపు 50 లక్షల పైచిలుకు యూజర్లు ఉన్నారు. ‘దేశీయంగా, అంతర్జాతీయంగా బిట్‌కాయిన్స్ విషయంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు, వర్చువల్ కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించేటప్పుడు వాటి మూలంగా తలెత్తే ఆర్థికపరమైన, భద్రతాపరమైన, చట్టపరమైన రిస్కులు, కస్టమర్స్ ప్రయోజనాల పరిరక్షణలో ఎదురయ్యే సమస్యలు మొదలైనవి దృష్టిలో ఉంచుకోవాలి‘ అని తమ యూజర్లకు పంపిన సందేశంలో ఎస్‌బీఐ కార్డ్ పేర్కొంది. మరో బ్యాంకు సిటీ ఇండియా ఇప్పటికే తమ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీల కొనుగోలు, ట్రేడింగ్‌ని అనుమతించరాదని నిర్ణయించిన విషయాన్ని ఎస్‌బీఐ కార్డ్ ప్రస్తావించింది.
క్రిప్టో కరెన్సీల విషయంలో హెచ్చరించినప్పటికీ.. క్రెడిట్ కార్డుల ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఎస్‌బీఐ కార్డ్ మాత్రం నిషేధం విధించకపోవడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ స్కీములు, బిట్‌కాయిన్స్ వంటి వర్చువల్ కరెన్సీల్లో లావాదేవీల నిర్వహణకు ఎవరికీ లైసెన్సులు ఇవ్వలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఆర్థిక సంస్థలు, సామాన్య ప్రజానీకానికి వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment