
భోజనం వద్దు.. టీ తాగు, బ్రెడ్ తిను: నటుడు
న్యూఢిల్లీ: తమ వాళ్లను బాలీవుడ్ సెలబ్రిటీలు వేధించారని 'బుక్ మై బాయ్' డొమెస్టిక్ సర్వీసెస్ సహవ్యవస్ధాపకుడు అనుపమ్ సిన్హాల్ ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. బుక్ మై బాయ్ అనేది మెయిడ్ సర్వీసెస్ అందజేసే ఆన్‌లైన్ సంస్ధ. 2015లో కంపెనీని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ 10 వేల ఇళ్లకు సర్వీసులు అందించినట్లు సిన్హాల్ చెప్పారు. రెండేళ్లుగా వీరి నుంచి ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలిపారు.
20 మందికిపైగా బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంస్ధ నుంచి మెయిడ్ సర్వీసెస్‌ను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అయితే, సెలబ్రిటీల ఇళ్లకు పనికి వెళ్లిన వారిని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సెలబ్రిటీల వివరాలను బయటపెట్టకుండా పనివారు ఎదుర్కొన్న ఐదు దారుణ సంఘటనలను వివరించారు ఆయన.
సెలబ్రిటీ 1: ఈ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి తల్లి చనిపోతే కర్మకాండలకు వెళ్లనివ్వలేదని చెప్పారు. ఆఖరి చూపులకు వెళ్లాలంటే తన స్ధానంలో వేరే వారిని ఉంచి వెళ్లాలని ఆమె ఆర్డరేశారని తెలిపారు. ఆమె ప్రవర్తించిన తీరు అమానుషమని.. ఇంతకంటే ఆమె గురించి తానేం మాట్లాడలేనని అన్నారు.
సెలబ్రిటీ 2: రూ.3 కోట్ల కారు కలిగిన ఓ యజమాని.. తన వద్ద పనిచేసే వ్యక్తికి భోజనం పెట్టలేనని చెప్పడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఊదారత కలిగిన ఆయన టీ తాగి, రోజుకు మూడు సార్లు బ్రెడ్ తినాలని మెయిడ్‌తో చెప్పినట్లు వివరించారు.
సెలబ్రిటీ 3: ఈ సెలబ్రిటీ మెయిడ్‌ను శారీరకంగా హింసించడం తనను ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. సదరు సెలబ్రిటీపై కంపెనీ ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే, కేసు నమోదయిన దగ్గర నుంచి స్టేషన్‌కు వెళ్లాల్సివస్తుందని.. తాను అలా వెళ్తే ఉపాధి కోల్పోతానని మెయిడ్ అందుకు నిరాకరించిందని చెప్పారు. మెయిడ్ స్టేషన్‌కు హాజరుకాకుండా ఫిర్యాదును తీసుకోలేమని పోలీసులకు చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు వివరించారు.
సెలబ్రిటీ 4: ఈ సెలబ్రిటీ మెయిడ్ వెళ్లిపోయినందుకు కంపెనీపై కేసు వేస్తానని బెదిరించారని తెలిపారు. శారీరకంగా, మానసికంగా మెయిడ్‌ను వేధించడంతో ఆమె వెళ్లిపోయిందని చెప్పారు.
సెలబ్రిటీ 5: బుక్ మై బాయ్‌కు ఇవ్వాల్సిన రూ.15 వేల సర్వీస్ చార్జీని ఈ సెలబ్రిటీ ఇవ్వలేదని ఆరోపించారు. పేమెంట్ కోసం కంపెనీ ప్రతినిధులు కాల్ చేయడంతో ఆమె(సెలబ్రిటీ) కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశారని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత తాను డబ్బులు కట్టనని ఏం చేసుకుంటారో చేసుకోమని అన్నారని తెలిపారు.
ఈ ఘటనలన్నీ తనను చాలా బాధపెట్టాయని చెప్పుకొచ్చారు. ఇక నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లకు ఎలాంటి సర్వీసులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.