జోరుగా కొత్త ఇన్వెస్టర్లు..!
గతేడాది డీమ్యాట్ ఖాతాల సంఖ్య 44 శాతం అప్
ముంబై: గత ఏడాది ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలు 44 శాతం పెరిగాయి. దేశంలోని రెండు డిపాజిటరీలు– ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌ల్లో 2015లో కొత్తగా 16.7 లక్షల ఇన్వెస్టర్ల ఖాతాలు ఉండగా, గత ఏడాది కొత్త ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 44 శాతం వృద్ధితో 24 లక్షలకు పెరిగింది. దీంతో 2015, డిసెంబర్ నాటికి 2.47 కోట్లుగా ఉన్న మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు గత ఏడాది డిసెంబర్ నాటికి 2.71 కోట్లకు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ 31నాటికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్‌ఎస్‌డీఎల్)లో 1.53 కోట్ల డీమ్యాట్ ఖాతాలున్నాయని క్యాపిటల్ మార్కెట్ నియం త్రణ సంస్థ, సెబీ వెల్లడించింది.
2015 చివరి నాటికి ఈ సంస్థలో ఉన్న ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య 1.43 కోట్లు. ఇక 2015, డిసెంబర్ నాటికి 1.04 కోట్లుగా ఉన్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్‌ఎల్) ఇన్వెస్టర్ల ఖాతాలు గత ఏడాది డిసెంబర్ నాటికి 1.18 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిటరీల్లోని ఇన్వెస్టర్ల ఖాతాల్లో ఉన్న సెక్యూ రిటీల విలువ గత ఏడాది డిసెం బర్ చివరినాటికి రూ.126.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందటి ఏడాదితో పోల్చితే ఈ మొత్తం 8 శాతం అధికం.
ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఉన్న డీమ్యాట్ ఖాతాల్లోని సెక్యూరిటీల విలువ రూ.112 లక్షల కోట్లుగానూ, సీడీఎస్‌ఎల్‌లోని డీమ్యాట్ ఖాతాల్లోని సెక్యూరిటీల విలువ రూ.14 లక్షల కోట్లుగానూ ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఖాతాలు తెరిచి సెక్యూరిటీలను డిపాజిట్ చేయడానికి ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌లు తోడ్పడతాయి. ఈ డిపాజిటరీల ఖాతాల్లో ఇన్వెస్టర్లు షేర్లు, డిబెంచర్లు, బాండ్లను ఎలక్ట్రానిక్ (డీ మెటిరియలైజ్‌డ్) రూపంలో ఉంచుకోవచ్చు.