అద్దెకు కారు డ్రైవర్‌! | car driver for rent in driverzz | Sakshi
Sakshi News home page

అద్దెకు కారు డ్రైవర్‌!

Published Sat, Jun 24 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

అద్దెకు కారు డ్రైవర్‌!

అద్దెకు కారు డ్రైవర్‌!

గంటకు రూ.90 చార్జీ; రోజుకైతే రూ.1,400
నెలకు 1,200 ఆర్డర్లు; రూ.12–15 లక్షల వ్యాపారం
దసరా నాటికి విజయవాడ, వైజాగ్‌ల్లో సేవలు షురూ
నెక్ట్స్‌ డ్రైవ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ సర్వీసెస్‌ సీఈఓ హితచంద్ర కనవర్తి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో కారు బయటికి తీయాలంటే ముందుగా చూసేది.. వెళ్లే రూట్లో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందోనని! అలా అని తీయకుండా ఉండలేం. పోనీ, క్యాబ్‌లను ఆశ్రయిద్దామంటే... చార్జీల మోత!! ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కారు నడుపుతూ పడే వ్యయ ప్రయాసలు మామూలువి కావు!

.. ఇలాంటి అనుభవాలన్నీ హితచంద్ర కనవర్తి కూడా పడ్డాడు! కాకపోతే అందరిలా ఉండిపోక.. పరిష్కారం కోసం నెక్ట్స్‌ డ్రైవ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థను ప్రారంభించేశాడు. ఇది గంటల చొప్పున కారు డ్రైవర్లను బుక్‌ చేసుకునే వేదిక. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. యూకేలో మాస్టర్స్‌ చదివా. ఆ తర్వాత అక్కడే స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తర్వాత అమెరికా వెళ్లా. డెలాయిట్లో ఎనిమిదేళ్లు వివిధ హోదాల్లో పనిచేశాక.. ఇండియాకు బదిలీ అయింది. ఇక్కడికొచ్చాకే ట్రాఫిక్‌లో కారు ప్రయాణం ఎంత ఇబ్బందో తెలిసింది. డ్రైవింగ్‌ కాదు పార్కింగూ సమస్యే. ట్రాఫిక్‌లో కారు నడుపుతూ ఆఫీసుకు వెళ్లి రావాలంటే చిరాకొచ్చేది. పోనీ, డ్రైవర్‌ను పెట్టుకుందామంటే.. ఆఫీసుకు రాను, పోను మినహా ఇతర సమయాల్లో డ్రైవర్‌ అవసరం లేదు. ఆ మాత్రం దానికి నెలమొత్తం డ్రైవర్‌కు వేతనం ఇవ్వాలా అనిపించేది? దీనికి పరిష్కారం వెతికే పనిలోనే ఈ ఆలోచన వచ్చింది. ఏడాదిన్నర పాటు మార్కెట్‌ సర్వే చేసి.. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌ కేంద్రంగా నెక్ట్స్‌ డ్రైవ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ సర్వీసెస్‌ను  ప్రారంభించా. ఈ కంపెనీ ప్రొడక్టే డ్రైవర్జ్‌.కామ్‌! యాప్, వెబ్‌సైట్‌ అభివృద్ధి, మార్కెటింగ్, డ్రైవర్ల నియామకం వాటి కోసం రూ.75 లక్షల వరకు ఖర్చుపెట్టా.

దసరాకల్లా విజయవాడ, వైజాగ్‌లకు..
ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సేవలందిస్తున్నాం. దసరా నాటికి విశాఖపట్నం, విజయవాడల్లో ప్రారంభిస్తాం. 2 నెలల్లో ఆయా నగరాల్లో డ్రైవర్లను నియమించుకుంటాం. ఈ ఏడాది ముగిసే నాటికి బెంగళూరు, చెన్నైలకు.. 2021 నాటికి దేశంలోని 45 నగరాలకు విస్తరించాలనేది లక్ష్యం. డ్రైవర్లకు నియామక పరీక్షలుంటాయి. గంటపాటు డ్రైవింగ్‌ టెస్ట్‌ పూర్తయ్యాక, బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేస్తాం. లీగల్, పోలీస్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెక్యూర్‌ టాస్క్‌ అనే ఇన్వెస్టిగేషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో డ్రైవర్ల మీద ఎలాంటి పోలీసు కేసులున్నా తెలిసిపోతుంది. ఆ తర్వాత కస్టమర్లతో నడవడిక, శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఆ తర్వాతే నియామకం. ఎంపికైన డ్రైవర్లకు నెలకు రూ.15–25 వేల మధ్య వేతనాలుంటాయి.

గంటలకు రూ.90..
ఇప్పటివరకు 6 వేల యాప్స్, 15 వేల మంది యూజర్లు నమోదయ్యారు. డ్రైవర్జ్‌ యాప్, వెబ్‌సైట్, కాల్‌ సెంటర్‌ మూడింట్లో దేని ద్వారానైనా మా సేవలను వినియోగించుకోవచ్చు. లాగిన్‌ కాగానే ఇన్‌స్టేషన్, ఔట్‌స్టేషన్, పర్మినెంట్‌ డ్రైవర్‌ అని 3 రకాల ఆప్షన్లను చూపిస్తుంది. ఏది కావాలంటే దాన్ని ఎంచుకోవచ్చు. 30 నిమిషాల్లో డ్రైవర్‌ ఇంటికొచ్చేస్తాడు. ఆర్డర్‌ బుక్‌ కాగానే డ్రైవర్‌ ఫొటో, అతని రేటింగ్, బ్యాక్‌గ్రౌడ్‌ వంటివన్నీ వస్తాయి. దీంతో కస్టమర్లకు నాణ్యమైన, నమ్మకమైన సేవలందుతాయి. డ్రైవర్‌ అద్దె గంటకు సిటీలో రూ.90, ఔట్‌స్టేషన్‌ అయితే రూ.120. రోజు మొత్తానికైతే రూ.1,400. రోజుకు 50–75 ఆర్డర్లొస్తున్నాయి. వారాంతాల్లో అయితే రెండింతల వృద్ధి నమోదు చేస్తున్నాం. ప్రతి ట్రిప్‌ 5 గంటలపైనే ఉంటుంది. నెలకు 1,200 ఆర్డర్లు, రూ.12–15 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం.

రూ.15–20 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం డ్రైవర్లు కాకుండా నిర్వహణ, టెక్నాలజీ బృందం కలిపి 10 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపులోగా మరో 10 మందిని నియమించుకుంటాం. ‘‘ఇప్పటికే కుటుంబీకులు, తెలిసిన వారి నుంచి రూ.2.5 కోట్ల వరకు నిధులను సమీకరించాం. ఏడాది తర్వాత ప్రైవేట్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.15–20 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం’’ అని హితచంద్ర వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement