అద్దెకు కారు డ్రైవర్లు
⇒ హైదరాబాద్‌లో డ్రైవర్జ్ సేవలు ప్రారంభం
⇒ అద్దె గంటకు రూ.90
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, బైకులు అద్దెకు తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, దేశంలోనే తొలిసారిగా డ్రైవర్లను కూడా అద్దెకు తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘నెక్ట్స్ డ్రైవ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సర్వీసెస్’ సంస్థ బుధవారమిక్కడ డ్రైవర్జ్ యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గంటలు, రోజులు, నెలవారీ ప్యాకేజీలుగా డ్రైవర్లను అద్దెకివ్వటం ఈ యాప్ ప్రత్యేకత అని సంస్థ సీఈఓ హితచంద్ర కనపర్తి తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ‘గంటల లెక్కన తీసుకుంటే డ్రైవర్ అద్దె గంటకు రూ.90 ఉంటుంది. మీ కార్లో మిమ్మల్ని కావాల్సిన చోట వదిలిపెట్టడమే కాదు.
అక్కడ మీ కారును, మిమ్మల్ని వదిలిపెట్టాక డ్రైవర్ బాధ్యత మీకుండదు. కస్టమర్ చెల్లించాల్సింది కూడా అప్పటివరకే. 6 నెలల క్రితం బీటా వర్షన్‌ను ప్రారంభించాం. ఇప్పటివరకు 60 మంది డ్రైవర్లు నమోదయ్యారు. 500 మంది కస్టమర్లు వినియోగించుకున్నారు. ఇపుడు పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తున్నాం’’ అని వివరించారు. 2 నెలల్లో 350–400 డ్రైవర్ల నమోదును లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారాయన. వచ్చే ఏడాది విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు విస్తరిస్తామని తెలియజేశారు.