
కోల్‌కత్తా : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణం అనంతరం, బ్యాంకు మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద దిగ్గజమైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో రూ.4.12 కోట్ల మోసం జరిగినట్టు వెల్లడైంది. దీనికి సంబంధించి ఎస్‌బీఐ అధికారులపై, ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన డైరెక్టర్లపై సీబీఐ కొరడా ఝుళిపించింది.
ఎస్‌బీఐలో రుణ మోసానికి పాల్పడిన ఎనిమిది ఎస్‌బీఐ అధికారులపై, సంస్థకు చెందిన ఐదుగురు డైరెక్టర్లపై కేసు నమోదుచేసినట్టు సీబీఐ పేర్కొంది. ఎస్‌బీఐ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది. కంపెనీకి చెందిన డైరెక్టర్లు పశ్చిమబెంగాల్‌లోని రెండు ఎస్‌బీఐ బ్రాంచులకు చెందిన అధికారులతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ కోసం ఈ ప్రైవేట్ సంస్థ రూ.4.45 కోట్ల రుణం తీసుకుంది. ఈ లావాదేవీలు 2009 నుంచి 2014 మధ్యకాలంలో జరిగాయి. కానీ రుణ గ్రహీత నియమ, నిబంధనలను ఉల్లంఘించారు.
దీంతో 2014 నవంబర్‌లో ఈ అకౌంట్ స్థూల నిరర్థక ఆస్తిగా మారిపోయిందని.. ఈ మోసంతో బ్యాంకుకు రూ.4.12 కోట్ల నష్టం ఏర్పడినట్టు సీబీఐ వెల్లడించింది. ఈ నష్టాల్లో వడ్డీ చెల్లింపులను ఇంకా కలుపలేదు. ఈ మోసానికి సంబంధించి ఎస్‌బీఐ అధికారులు, ప్రైవేట్ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదుచేసింది. అంతేకాక వారి నివాసాలపై సీబీఐ దాడులు కూడా నిర్వహించింది. కోల్‌కత్తా, డార్జిలింగ్, హజిపుర్(బిహార్), పెల్లింగ్(సిక్కిం), కూచ్బెహర్( పశ్చిమ బెంగాల్) వంటి మొత్తం 12 ప్రాంతాల్లో రైడ్స్ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment