24 మంది ఉద్యోగుల పేరుతో రుణాలు స్వాహా
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి...
సూర్యాపేట: తను పనిచేస్తున్న ఎన్‌బీఐ బ్యాంకులోని సొమ్మునే ఓ మేనేజర్ కాజేశారు. 2022 నుంచి 2023 వరకు 24 మంది ఉద్యోగుల పేరుతో రుణాలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ సైదులు సూర్యాపేట ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బ్యాంక్ రుణం తీసుకునేందుకు అర్హత కలిగిన వారిని ఎంచుకొని కుంభకోణానికి శ్రీకారం చుట్టాడు.
బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉన్నా, సాంకేతిక కారణాలు చూపి, అవసరమైన అదనపు పత్రాలు లేవంటూ రుణ దరఖాస్తును మొదటగా తిరస్కరించేవాడు. ఆపై అదే దరఖాస్తు ఆధారంగా, దరఖాస్తుదారుడి పేరు, వివరాలతో నకిలీ పత్రాలు సృష్టించి, వారి పేర్లతో మరోసారి రుణం కోసం దరఖాస్తు చేసేవాడు. దీనికి రుణం మంజూరు చేసినట్టు బ్యాంకు రికార్డుల్లో పొందుపర్చేవాడు. ఇలా ఒక్కో దరఖాస్తుదారుడి పేరుతో కనిష్టంగా రూ.15 లక్షలు కాజేశాడు. ఈ మొత్తాన్ని తన సొంత ఖాతాల్లోకి మళ్లించాడు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
ఉద్యోగుల పేరుతో రుణం తీసుకొని తన ఖాతాల్లోకి మళ్లించుకున్న సైదులు గత సంవత్సరం హైదరాబాద్‌లోని సీసీసీ (కమర్షియల్ క్లయింట్‌గ్రూప్) మేనేజర్‌గా బదిలీ అయ్యాడు. అయితే తాను తీసుకున్న ఈ రుణాలకు ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించేవాడు.
2024 ఫిబ్రవరి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితులు సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇతను రామంతాపూర్ ఎస్‌బీఐ మేనేజర్‌తో కలిసి ఇదే తరహా మోసం చేసి రూ. 2.84 కోట్లు, సికింద్రాబాద్‌లో వెస్ట్ మారేడ్‌పల్లి బ్రాంచ్ నుంచి రూ. 9.50 కోట్లు కాజేసినట్టు సమాచారం.
కొందరు ఉద్యోగులకు తెలిసే చేశారా ?
పోలీస్‌శాఖలో 11 మంది ఉద్యోగులు, వైద్యారోగ్యశాఖలో ఇద్దరు, విద్యాశాఖలో ఇద్దరు, ఎక్సైజ్‌లో ఇద్దరు, కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు చెందిన ఐదుగురు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు ఇలా మొత్తం 24 మంది ఉద్యోగుల పేరుతో బ్యాంక్ మేనేజర్ రుణం తీసుకున్నాడు.
అయితే తమ పేరున రుణాలు తీసుకున్నట్టు కొందరు ఉద్యోగులకు ముందుగానే తెలిసినట్టు సమాచారం. మేనేజర్‌తో ఉద్యోగులు పర్సెంటేజీ మాట్లాడుకొని రుణం తీసుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మరి కొంతమంది ఉద్యోగులు మేనేజర్ మాయమాటలకు మోసపోయినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment