
దేశీ మార్కెట్లోకి చైనా కార్ల కంపెనీ
ఎంజీ కార్ బ్రాండ్‌తో వస్తున్న ఎస్‌ఏఐసీ 2019 నుంచి తయారీ కార్యకలాపాలు
న్యూఢిల్లీ: చైనా ఆటోమొబైల్ దిగ్గజం ఎస్‌ఏఐసీ మోటార్ కార్పొరేషన్ తాజాగా భారత్ మార్కెట్లో అడుగుపెడుతోంది. ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) వాహనాలను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్ల తయారీ కోసం భారత్‌లో సొంత ప్లాంటు ఏర్పాటు చేయనుంది. తయారీ ప్లాంటుకు అనువైన ప్రదేశంపై కసరత్తు జరుగుతోందని, 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని ఎస్‌ఏఐసీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది.
ఎంజీ మోటార్ ఇండియా పేరిట పూర్తి అనుబంధ సంస్థ ద్వారా భారత కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది. వాన్‌గార్డ్ మాజీ గ్లోబల్ సీవోవో రాజీవ్ చాబా ఈ సంస్థకు ప్రెసిడెంట్, ఎండీగా ఉంటారు. అలాగే వాహన పరిశ్రమలో సీనియర్ పి. బాలేంద్రన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 100బిలియన్ డాలర్లు పైగా వార్షికాదాయంతో ఫార్చూన్ గ్లోబల్ 500 లిస్టులో ఎస్‌ఏఐసీ 46వ స్థానంలో ఉంది. 2008లో కొనుగోలు చేసిన బ్రిటిష్ బ్రాండ్ ఎంజీతో పాటు రోవీ, మాక్సస్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది.
2009లో జనరల్ మోటార్స్(జీఎం) దివాలా అంచున నిల్చినప్పుడు దాని భారత విభాగంలో ఎస్‌ఏఐసీ 50% వాటాలు కొనుగోలు చేసింది. తర్వాత జీఎం మళ్లీ తన వాటాలు తిరిగి కొనుగోలు చేసింది. జీఎం గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో ఉత్పత్తి నిలిపివేయడంతో ఆ ప్లాంటు కొనుగోలు చేసేందుకు ఎస్‌ఏఐసీ ఆసక్తి కనపర్చింది. అయితే, లాంఛనంగా ఇంకా ఒప్పందం కుదుర్చుకోలేదు.