62 సెజ్‌లు రద్దు!
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)పై డెవలపర్లకు ఆసక్తి సన్నగిల్లినట్లుంది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ సహా 62 సెజ్‌లను రద్దు చేయాలన్న ప్రతిపాదనలపై జూలై 3న జరిగే కేంద్ర వాణిజ్య శాఖ ‘బోర్డ్ ఆఫ్ అప్రూవల్’ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 62 సెజ్‌లకు సంబంధించిన అనుమతుల (ఎల్‌వోఏ) గడువు పొడిగించాలని కోరుతూ డెవలపర్ల నుంచి ఎటువంటి దరఖాస్తులు రాలేదు. కొన్నింటిని రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థనలు మాత్రం వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని నిర్ణయం తీసుకునేందుకు బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ స్వేచ్ఛా వాణిజ్య, వేర్‌హౌసింగ్ జోన్‌ను ఏర్పాటు చేయాలనుకోగా, దీన్ని చేపట్టలేనంటూ స్పష్టం చేసింది.
రద్దు కానున్న సెజ్‌లలో ఢిల్లీ రాష్ట్ర పారిశ్రామిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, లార్క్ ప్రాజెక్ట్స్, మానససరోవర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డైమండ్ ఐటీ ఇన్‌ఫ్రాకాన్ చేపట్టిన సెజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మే 1 నాటికి ప్రభుత్వం 421 సెజ్‌లకు అనుమతులు జారీ చేయగా వీటిలో 218 మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు 2016–17 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న సెజ్‌ల నుంచి ఎగుమతులు 12 శాతం వృద్ధి చెంది రూ.5.24 లక్షల కోట్లకు చేరాయి. రూ.4.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఇవి ఆకర్షించగా, 17.31 లక్షల మందికి ఉపాధి కల్పించాయి.