వేతన పెంపు, ప్రమోషన్లకు రెడీ | Compnies in salary hikes and promotions | Sakshi
Sakshi News home page

వేతన పెంపు, ప్రమోషన్లకు రెడీ

Published Thu, May 28 2020 11:40 AM | Last Updated on Thu, May 28 2020 11:46 AM

Compnies in salary hikes and promotions - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కోవిడ్‌-19 నేపథ్యంలో పలు రంగాలు, కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు సిబ్బందిని తొలగిస్తుంటే.. మరికొన్ని సంస్థలు వేతనాలలో కోతలను అమలు చేస్తున్నాయి. అయితే ఇలాంటి కష్టకాలంతో ఉద్యోగులను ఆదుకునేందుకు సిద్ధమంటూ కొన్ని బ్లూచిప్‌ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. జాబితాలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీసీబీ, బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌, ఇన్‌ఫ్లెక్షన్‌ పాయింట్‌ వెంచర్స్‌ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. 

కంపెనీ విధానాలివి
కరోనా వైరస్‌ సవాళ్లు విసురుతున్నప్పటికీ ఈ ఏడాదిలో సైతం కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపు, పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ సీఎస్‌ఎస్‌ కార్ప్‌ సీఈవో మనీస్‌ టాండన్‌ పేర్కొన్నారు. కంపెనీలో పనిచేస్తున్న 7,000 మంది ఉద్యోగులకు ఇప్పటికే వీటిని అమలు చేసినట్లు తెలియజేశారు. కష్టకాలంలో సిబ్బందికి అండగా నిలవడం ద్వారా సంస్థలపట్ల భరోసా కల్పించేందుకు కోవిడ్‌-19 ద్వారా అవకాశం లభించినట్లేనని బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ ఎండీ నీరజ్‌ బల్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను చేపట్టినట్లు వెల్లడించారు. అయితే మార్కెటింగ్‌, ట్రావెలింగ్‌  వ్యయాలలో కోత పెట్టడంతోపాటు.. కొత్తగా సిబ్బందిని తీసుకోవడాన్ని నిలిపివేసినట్లు తెలియజేశారు.  

పరిస్థితులకు అనుగుణంగా
లాక్‌డవున్‌ అమలు, డిమాండ్‌ పడిపోవడం, ఉత్పత్తి, లాజిస్టిక్స్‌ సమస్యలు వంటి పలు సవాళ్లను వివిధ రంగాలు, కంపెనీలు ఎదుర్కొంటున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. దీంతో బిజినెస్‌ అవసరాలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు సిబ్బంది, పంపిణీ వంటి అంశాలలో చర్యలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా కంపెనీలు ప్రణాళికలు అమలు చేస్తుంటాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. లాక్‌డవున్‌ కారణంగా మార్చి నుంచి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పటికీ ఉద్యోగుల వేతనాలలో కోతలు లేదా సిబ్బందిని తొలగించడం వంటి చర్యలను చేపట్టడంలేదని ఇన్‌ఫ్లెక్షన్‌ పాయింట్‌ వెంచర్స్‌ సీఈవో వినయ్‌ బన్సల్‌ ఈ సందర్భంగా చెప్పారు. 

వెనకడుగులో
కోవిడ్‌-19 నేపథ్యంలో ఇటీవల సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజాలు టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌తోపాటు.. పీడబ్ల్యూసీ ఇండియా తదితర కంపెనీలు వేతన పెంపును వాయిదా వేసేందుకు నిర్ణయించాయి. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓయో రూమ్స్‌, టీవీఎస్‌ మోటార్స్‌ జీతాలలో కోతలు విధించనుండగా.. ఓలా, ఉబర్‌, జొమాటో, ఐబీఎం తదితర కంపెనీలు కొంతవరకూ సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివిధ రంగాలు, కంపెనీలకు ఎదురవుతున్న సమస్యల ఆధారంగా నిర్వహణపరమైన నిర్ణయాలు తీసుకుంటుంటాయని తెలియజేశారు. కన్జూమర్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్‌ప్రాసెసింగ్‌ వంటి రంగాలలో డిమాండ్‌ కనిపిస్తుంటే.. ఆటో, కన్‌స్ట్రక‌్షన్‌ తదితర రంగాలు డీలాపడినట్లు వివరించారు. దీంతో బిజినెస్‌పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కంపెనీలు వేతన పెంపు, బోనస్‌లు వంటివి ప్రకటించకపోవచ్చని తెలియజేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని కంపెనీలు వేతన పెంపు వంటివి చేపడుతున్నట్లు డెలాయిట్‌ ఇండియా అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది వేతన పెంపు తదితరాలను చేపట్టినట్లు హెచ్‌యూఎల్‌ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ బాటలో భారత్‌పే, మింత్రా పనితీరు ఆధారిత ఇంక్రిమెంట్లు ఇచ్చినట్లు వెల్లడించాయి. ఇక కోక కోలా బాట్లింగ్‌ భాగస్వామి హెచ్‌సీసీబీ ఉద్యోగులకు ఈ ఏడాది 7-8 శాతం వేతనపెంపును చేపట్టగా.. ఏషియన్‌ పెయింట్స్‌ సైతం సిబ్బంది జీతభత్యాలను పెంచినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement