ఆర్‌బీఐ vs కేంద్రం | Crucial RBI board meeting on Monday amid ongoing rift with govt | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ vs కేంద్రం

Published Mon, Nov 19 2018 1:18 AM | Last Updated on Mon, Nov 19 2018 9:19 AM

Crucial RBI board meeting on Monday amid ongoing rift with govt - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వివాదాస్పద పీసీఏ నిబంధనలు, చిన్న సంస్థలకు రుణాల మంజూరు తదితర వివాదాస్పద అంశాలపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ టీమ్‌పై ఆర్థిక శాఖ నామినీలు, కొంతమంది స్వతంత్ర డైరెక్టర్లు అస్త్రాలు సంధించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పటేల్‌ రాజీనామా చేయాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్నప్పటికీ.. ఒత్తిళ్లకు ఆయన లొంగకపోవచ్చని వివరించాయి. తాము అమలు చేస్తున్న విధానాలను మరింత గట్టిగా సమ ర్థించుకునే ప్రయత్నమే చేయొచ్చని పేర్కొన్నాయి.  

గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సారథ్యంలోని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డులో ప్రస్తుతం 18 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్య 21 దాకా పెంచుకోవచ్చు. ప్రస్తుత బోర్డులో ఆర్‌బీఐ గవర్నర్‌తో పాటు నలుగురు డిప్యూటీలు ఫుల్‌ టైమ్‌ అధికారిక డైరెక్టర్లుగా ఉండగా, 13 మందిని కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. వీరిలో ఆర్థిక శాఖకు చెందిన అధికారులు ఇద్దరు ఉన్నారు.

సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) కఠిన నిబంధనలు, చిన్న తరహా సంస్థలకు రుణాల మంజూరీ నిబంధనల సడలింపు వంటి విషయాల్లో నెలకొన్న విభేదాలను తొలగించుకునేలా ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని రూపొందించాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పీసీఏకి సంబంధించి ఈ సమావేశంలో కాకపోయినా మరికొన్ని వారాల్లో తగు పరిష్కారమార్గం కనుగొనే అవకాశం ఉన్నట్లు వివరించాయి.  

వివాదాస్పద అంశాలివీ..  
వీటిని సడలించిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పలు బ్యాంకులకు కొంత వెసులుబాటు లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులు ఉండగా, వీటిలో 11 బ్యాంకులు ప్రస్తుతం పీసీఏ కింద ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. రిస్కులెక్కువగా ఉన్న అసెట్స్‌కి, మూలధనానికి మధ్య నిష్పత్తి తగ్గినా, నికర నిరర్ధక ఆస్తులు పెరిగినా, అసెట్స్‌పై రాబడులు భారీగా తగ్గినా పీసీఏ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే, పీసీఏని ప్రయోగించడానికి అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకులు .. క్యాపిటల్‌ అడెక్వసీ రేషియోని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇక చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాల మంజూరీలో కొంత సడలింపునివ్వడం, లిక్విడిటీ కొరతను ఎదుర్కొంటున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ద్రవ్య లభ్యత మెరుగుపడేలా వ్యవస్థలో మరింత నిధులను అందుబాటులోకి తేవడం వంటివి ఆర్‌బీఐ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ రంగాల సంస్థలకు రిస్కులు ఎక్కువగా పొంచి ఉన్నాయనే భావనతో ఆర్‌బీఐ దీన్ని విభేదిస్తోంది. రెండు పక్షాలు ఇందుకు సంబంధించి బహిరంగంగానే తమ మధ్య విభేదాలను బైటపెట్టాయి.   

 సెంట్రల్‌ బ్యాంక్‌ స్వయం ప్రతిపత్తిని గౌరవించకపోతే ఎకానమీకి పెను విపత్తు తప్పదంటూ ఆర్‌బీఐ డిçప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వ్యాఖ్యానించడం దీనికి ఆజ్యం పోసింది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ను దారికి తెచ్చుకునేందుకు గతంలో ఎన్నడూ ప్రయోగించని ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7ని ప్రయోగించడంపై కేంద్ర ఆర్థిక సమాలోచనలు కూడా జరపడం మరింత వివాదాస్పదమైంది.  అటు ఆర్‌బీఐలో కేంద్రం నామినేట్‌ చేసిన ఎస్‌ గురుమూర్తి సైతం కేంద్ర ప్రభుత్వ వాదనలను వెనకేసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ కలిసి పనిచేయాలని లేదా రాజీనామా చేసి తప్పుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ కో–కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వ్యాఖ్యానించారు.


ఆర్‌బీఐని కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటోంది!  
రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న రూ. 9 లక్షల కోట్ల నిధులపై అజమాయిషీని దక్కించుకునేందుకు ఆర్‌బీఐని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఆర్‌బీఐ బోర్డు భేటీ ఘర్షణాత్మకంగానే ఉండవచ్చని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద రూ. 9.59 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయి. ద్రవ్య లోటు తదితర సమస్యల పరిష్కారం కోసం వీటిలో కనీసం మూడో వంతు నిధులైనా (సుమారు రూ. 3.6 లక్షల కోట్లు) తమకు ఇవ్వాలంటూ ఆర్‌బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ కేంద్రం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ బోర్డు భేటీ, చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement