వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పుంజుకుని 34,102ను తాకగా.. నిఫ్టీ 38 పాయింట్లు బలపడి 10,089 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో టాంజానియా ప్రభుత్వం నుంచి మరోసారి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో కండోమ్స్ తయారీ కంపెనీ క్యుపిడ్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. ఇక మరోపక్క అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్న వార్తలతో ఎన్‌బీఎఫ్‌సీ.. జేఎం ఫైనాన్షియల్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు షేర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
క్యుపిడ్ లిమిటెడ్
టాంజానియా ప్రభుత్వ సంస్థ.. మెడికల్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి రిపీట్ ఆర్డర్ లభించినట్లు క్యుపిడ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. పురుష కండోమ్స్ సరఫరాకు లభించిన ఈ ఆర్డర్ విలువను రూ. 23.6 కోట్లుగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యుపిడ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 3.4 శాతం లాభపడి రూ. 180 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 7 శాతం జంప్‌చేసి రూ. 187 సమీపానికి చేరింది. గత ఏడాది కాలంలో ఈ కౌంటర్ 40 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
జేఎం ఫైనాన్షియల్
ప్రయివేట్ రంగ కంపెనీ.. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ తాజాగా షేరుకి రూ. 70 సంకేత ధరలో క్విప్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే క్విప్ ధర 1.4 శాతం తక్కువగా సంబంధిత వర్గాలు తెలియజేశాయి. క్విప్ ద్వారా 10.18 కోట్ల డాలర్లను(రూ. 770 కోట్లు) సమీకరించాలని జేఎం ఫైనాన్షియల్ భావిస్తున్నట్లు వెల్లడించాయి. క్విప్ నిర్వహణలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్ మర్చంట్ బ్యాంర్లుగా సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 75 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment