బాబా రాందేవ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పతంజలి ఆయుర్వేద్ బ్రాండుకు చెందిన సబ్బుల ప్రకటనలను టీవీల్లో ప్రసారం చేయడం ఆపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పతంజలి తన వాణిజ్య ప్రకటనలలో సబ్బు బ్రాండ్ డెటాల్‌ను తక్కువ చేస్తుందని రెక్కిట్ బెంకైసెర్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పతంజలి సబ్బు బ్రాండు ప్రకటనపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం ఇది రెండోసారి. అంతకముందు బొంబై హైకోర్టు కూడా పతంజలి ఈ ప్రకటనను ఆపివేయాలంటూ ఆదేశించింది. ఎఫ్‌సీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనీలివరీ లిమిటెడ్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు అప్పుడు బొంబై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.
పతంజలి తన వ్యాపార ప్రకటనలో డెటాల్ సోప్, హెచ్‌యూఎల్ పియర్స్, లైఫ్‌బాయ్ వాటిని దిగజారుస్తుండటంతో ఈ మొత్తం వివాదం చెలరేగింది. పతంజలి ప్రకటనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు, కోటికిపైగా నష్టపరిహారాల కోసం తాము పోరాడినట్టు రెక్కిట్ బెంకైసర్ న్యాయవాది నాన్సీ రాయ్ పేర్కొన్నారు. పతంజలి తన కొత్త సబ్బు ప్రకటనలో డెటాల్‌ను 'ధిటాల్'గా, పియర్స్‌ను 'టియర్స్'గా, లైఫ్‌బాయ్‌ను 'లైఫ్‌జాయ్'గా విమర్శిస్తోంది. పతంజలి కంపెనీ రూపొందిస్తున్న వివాదస్పదమైన ప్రకటనలపై ఓ వైపు కోర్టులో కంపెనీలు పోరాడుతుండగా.. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బాబా రాందేవ్‌కు చెందిన ఈ కంపెనీకి 40 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. పతంజలి ఆయుర్వేదకు కేటాయించిన ఒక్కో ఎకరం రూ.25 లక్షలు. ఈ భూమి కోసం ప్రభుత్వ ఖాతాల్లో రూ.10 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించినట్టు మధ్యప్రదేశ్ ఔద్యోగిక్ కేంద్ర వికాస్ నిగమ్ ఎండీ కుమార్ పురుషోత్తం తెలిపారు.