పసిడి రేటు మరింత తగ్గే అవకాశం!
అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్, దేశీయంగా నగదు కొరతతో జ్యుయలర్లు.. రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గుదల వంటి అంశాలతో పుత్తడి ధరలు వరుసగా మరో వారమూ నష్టాల్లోనే ముగిశాయి. వారాంతంలో అంతర్జాతీయంగా పసిడి కాస్త పుంజుకున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం నష్టాలు తప్పలేదు. రాబోయే రోజుల్లో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మరింత వేగంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశమున్నందున డాలర్ బలపడి.. స్వల్పకాలికంగా పసిడి, వెండి రేట్లు మరింతగా క్షీణించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో పసిడి ధర గతవారం రూ.130 మేర తగ్గింది. ఆభరణాల బంగారం పది గ్రాముల రేటు వారం మొదట్లో రూ. 27,750 వద్ద ప్రారంభం కాగా ఆఖరున క్రితం వారం ముగింపుతో పోలిస్తే రూ. 130 నష్టంతో రూ. 27,650 వద్ద క్లోజయ్యింది. అలాగే మేలిమి బంగారం ధర కూడా రూ. 27,900 వద్ద ప్రారంభమై దాదాపు రూ. 130 నష్టంతో రూ. 27,800 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర కీలకమైన రూ. 39,000 కన్నా దిగువన రూ. 38,810 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా పసిడి ఔన్సు (31.1 గ్రాములు) రేటు 1,132 డాలర్ల స్థాయిలో ఉంది.