
ఐఎంటీ హైదరాబాద్ లో ప్రసంగిస్తున్న డాక్టర్ విజయ్ గోవిందరాజన్
హైదరాబాద్: భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలు అసాధారణ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున సంప్రదాయ పద్ధతులను వీడి నూతన ఆవిష్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, డార్ట్ మౌత్ కాలేజీ ఆఫ్ టక్ స్కూల్ ఆప్ బిజినెస్ అధ్యాపకులు, హార్వర్డ్ బిజనెస్ స్కూల్ మార్విన్ బొవర్ మెంబర్ డాక్టర్ విజయ్ గోవిందరాజన్ అన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ(ఐఎంటి)లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కార్పొరేట్ ప్రపంచం ప్రతి సమస్యకు మూడు బాక్సుల(త్రీ బాక్స్) పరిష్కారం వైపు మొగ్గుచూపుతాయని, ఇందులో భాగంగా తమ వ్యూహాలను మార్చుకుంటూ పురోగతి కోసం ఆవిష్కరణలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించి తమ ఉత్పత్తులను కొనేలా చేయడం కోసం కంపెనీలు పలు పంథాలు అనుసరిస్తున్నాయని, దీనికోసం హెల్త్ కేర్ రంగంలో వస్తున్న మార్పులను గోవిందరాజన్ వివరించారు.
బంగ్లాదేశ్ లో ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ స్థాపించిన గ్రామీణ బ్యాంకును ఏ విధంగా అభివృద్ధి పధంలో నడిచిందీ సవివరంగా వివరించారు. స్వాతంత్ర పోరాట సమయంలో మహాత్మ గాంధీ అనుసరించిన అహింసా మార్గాన్ని కూడా డిస్రప్టివ్ ఆవిష్కరణగా గోవిందరాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐఎంటి విద్యార్ధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.