
భారతదేశంలో సంపన్నులు, సంపన్నులుగానే ఉన్నారు, పేదవారు.. పేదవారుగానే ఉన్నారు. ఈ అసమానతలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిని నివారించాలంటే.. ఇండియాలోని ధనికులపైన అధిక పన్నులు విధించాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త 'థామస్ పికెట్టీ' (Thomas Piketty) పేర్కొన్నారు.
10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులున్న వ్యక్తులపైన 2 శాతం సంపద పన్నును విధిస్తే.. భారతదేశ వార్షిక ఆదాయం 2.73 శాతం పెరుగుతుంది. అదే విలువగల ఆస్తిపైన 33 శాతం వారసత్వ పన్ను విధించవచ్చని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై పన్ను విధించేందుకు.. కలిసి పని చేసేందుకు 20 ప్రధాన దేశాల ఆర్థిక మంత్రులు వాగ్దానం చేసారు. దీనిని భారత్ కూడా అనుసరించాలని ''21వ శతాబ్దంలో రాజధాని'' (Capital in the 21st Century) పుస్తక రచయిత కోరారు.
ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో.. ధనవంతులపై పన్ను విధించడంలో భారతదేశం చురుకుగా ఉండాలని పికెట్టీ పేర్కొన్నారు. ఒక శాతం అగ్రశ్రేణి సంపన్న భారతీయులు కలిగి ఉన్న జాతీయాదాయ నిష్పత్తి.. అమెరికా, బ్రెజిల్ దేశాల సంపన్నులను మించిపోయిందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
2022 - 2023లో.. భారతదేశంలోని ధనవంతులైన 1 శాతం మంది దేశానికి చెందిన సంపదలో 40.1 శాతాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఇండియాలోని 100 మంది ధనవంతుల సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసినట్లు తెలిసింది.