వాయిదా వేయకండి..
నష్టపోవడమంటే ఎవరికి ఇష్టముంటుంది చెప్పండి. ఇన్వెస్టర్లు కూడా అందరిలాగే. అయితే వీరికెప్పుడూ అధిక రాబడులపైనే కన్నుంటుంది. అందుకే వీరు అక్కడ నష్టాలున్నాయని తెలిసినా కూడా లాభాల కోసం అందుబాటులోని అవకాశాలను వెతుక్కుంటారు. అయితే ఇక్కడ నష్టాలకు భయపడేవారూ కొందరుంటారు. వీరు నష్టాలకు భయపడి వారి పెట్టుబడులను వాయిదా వేసుకుంటుంటారు. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్లకు అనువైన అవకాశం కోసం వేచిచూడటం ఎలా ఉంటుందంటే.. పంట వేయడం కోసం రైతులు వర్షాల కోసం ఎదురుచూసినట్లు. మనం ఇన్వెస్ట్‌మెంట్లను వాయిదా వేసుకుంటున్నామంటే.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వదులుకుంటున్నామని అర్థం చేసుకోవాలి.
కొందరు బస్సు కోసం చూస్తుంటారు. వస్తుంది. కానీ ఎక్కరు. అది కాస్తా ఖాళీగా లేదనకుంటూ వేరొక బస్సు కోసం ఉండిపోతారు. బస్సు ఎక్కితేనే కదా గమ్య స్థానానికి చేరేది? ఎక్కకుండా ఖాళీ బస్సు రావాలనుకుంటే కుదురుతుందా? అక్కడే ఉంటే ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాం కదా!! బస్సు ఎక్కిన తర్వాత అందులో కుదుపులు, స్టాప్‌లు ఉంటాయి. అయితేనేం చివరకు గమ్యాన్ని చేరతాం కదా? ఇన్వెస్ట్‌మెంట్లు కూడా బస్సులాగే. తర్వాత చేద్దాంలే.. తర్వాత చూద్దాంలే అని అనుకుంటే.. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకుంటూ ఆర్థిక జీవితాన్ని ఆనందంగా గడపాలి.
తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. అలాగే అప్పు తీసుకునేటప్పుడు స్మార్ట్‌గా వ్యవహరించాలి. సమస్యలు, నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ప్రతి సంఘటన ఒక అనుభవాన్ని ఇస్తు్తంది. వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ పరిస్థితులకు అనువుగా ముందుకు సాగిపోవాలి. భయాన్ని అధిగమించాలి. అస్థిరతను జయించాలి. చేసే ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల ఇప్పటికిప్పుడు ఏం వస్తుందో చెప్పలేం. కానీ వృద్ధి అనేది ఒకటుంటుంది. దాన్ని గమనించాలి. దీనికి కొంత కాలాన్ని కేటాయించాలి. నీ వద్ద ఉన్న డబ్బులతో నీవేమీ చేయకపోవడమనేది చాలా పెద్ద తప్పు. ఇన్వెస్ట్‌మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి అనువుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లాలి. అప్పుడు మీరే మీ భయాల్ని మెల్లగా అధిగమిస్తారు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే మనకేమీ దొరకదు కదా?