సాక్షి, హైదరాబాద్: ట్యూబ్‌లైట్లు, సీఎఫ్‌ఎల్ బల్బులకు కాలం చెల్లింది. వెలుతురుతో పాటూ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే జాబితాలో లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) లైట్లు చేరాయి. సెల్‌ఫోన్ నుంచి కూడా ఆపరేటింగ్ చేసుకునే వీలుండటం వీటి ప్రత్యేకత. బల్బు, ట్యూబ్‌లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. అదే ఎల్‌ఈడీ లైట్లలో మనం కోరుకున్న రంగు మార్కెట్‌లో దొరుకుతుంది.
అంతేకాదు ఇంట్లో గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును మార్చుకోవచ్చు కూడా. ఈమధ్య కాలంలో నగర వాసుల్లో ఈ విధమైన అభిరుచి బాగా పెరిగిపోయింది. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్‌లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, జువెల్లరీ, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారు.
రోజుకో రంగు..: రోజును బట్టి ఇంట్లో లైట్ రంగును మార్చుకోవాలనే అభిరుచి కూడా నగరవాసుల్లో ఈమధ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే ఒకే ఎల్‌ఈడీ లైట్‌తో రోజుకో రంగును వెదజల్లేలా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సోమవారం– ఎరుపు, మంగళవారం– ఆకుపచ్చ, బుధవారం– నీలం, గురువారం– వామ్ లైట్, శుక్రవారం– పర్పుల్, శనివారం– ఆరెంజ్, ఆదివారం– తెలుపు రంగులను ఎంపిక చేసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు.
సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్..: ప్రస్తుతం ఎల్‌ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్‌ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐ–ఫోన్, ఐప్యాడ్‌ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, థియేటర్లు, షామింగ్ మాళ్లులో వినియోగిస్తుంటారు.
ధర ఎక్కువైనా..: బల్బు, సీఎఫ్‌ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్‌ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఓల్టుల ఎల్‌ఈడీ లైట్ ధర రూ. 1,500–1,800 మధ్య ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ. 8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు. 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్‌కు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాళ్లకు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment