
సేవల రంగం విస్తరించాలి: నిర్మలా సీతారామన్
గ్రేటర్ నోయిడా: సేవల రంగం మరింతగా విస్తరించాలని, నాలుగో తరం పారిశ్రామిక విప్లవంతో హైటెక్ తయారీ రంగంలో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సేవల రంగం ప్రాధాన్యాన్ని గుర్తించి కేంద్రం టూరిస్టులు, వ్యాపారవేత్తల రాకపోకలకు మరింత వెసులుబాటు కల్పించేలా వీసా నిబంధనలను కూడా సరళతరం చేసినట్లు తెలియజేశారు. సేవల రంగంపై జరిగిన గ్లోబల్ ఎగ్జిబిషన్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ 2014–15 నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా సర్వీసుల వ్యాపారం తగ్గినప్పటికీ.. భారత్ మాత్రం రెండున్నర రెట్లు అధిక వృద్ధి నమోదు చేసిందన్నారు. అంతర్జాతీయంగా సేవల వ్యాపార విభాగంలో భారత వాటా 3.3 శాతంగా ఉందన్నారు.