![ED Asks Anil Ambani To Appear Again Over Yes Bank Case - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/03/20/Anil-Amban.jpg.webp?itok=8fin87cU)
సాక్షి, న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ రుణాల వ్యవహారంలో గురువారం ఈడీ ఎదుట హాజరైన రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ ఈనెల 30న మరోసారి దర్యాప్తు అధికారుల ఎదుట హాజరుకానున్నారు. యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ సంస్ధలు భారీగా రుణాలు పొందిన క్రమంలో వీటిపై ఈడీ అధికారులు మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆయనను మరోసారి ప్రశ్నించనున్నారు. మార్చి 30న మరోసారి తమ ఎదుట హాజరు కావాలని అనిల్ అంబానీని ఈడీ కోరింది. యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌పై దాఖలైన మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అంబానీని ఈడీ గురువారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
కేసుకు సంబంధించి కీలకమైన పలు వివరాలను అంబానీ నుంచి ఈడీ అధికారులు రాబట్టారు. అనిల్ అంబానీకి చెందిన అడాగ్ యస్ బ్యాంక్ నుంచి రూ 13,000 కోట్ల రుణాలను రాబట్టింది. విచారణలో భాగంగా యస్ బ్యాంక్ నుంచి పొందిన రుణాలను గ్రూప్ కంపెనీలు ఖర్చు చేసిన తీరు, యస్ బ్యాంక్‌తో అడాగ్ ఒప్పందం గురించి ఈడీ అధికారులు అంబానీని ప్రశ్నించారు. కాగా, రాణాకపూర్, ఆయన భార్య, కుమార్తెలు లేదా వారి కంపెనీల్లో రిలయన్స్ గ్రూప్ ఎలాంటి చెల్లింపులూ జరపలేదని అంబానీ స్పష్టం చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment