మాల్యాకు రెడ్ కార్నర్ నోటీస్
న్యూఢిల్లీ : బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కొత్త చిక్కు ఎదురు కాబోతుంది. మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి, మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. గత మంగళవారమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై మే20 తేదీ వరకు స్పందించాలని ఆదేశించింది.
మరోవైపు విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.
‘1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని మేము ఆదేశించలేము’ అని బ్రిటన్ ప్రభుత్వం తెలిపిందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. గత నెలే అతనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసి భారత్ కు రప్పించాలని, విచారణకు తోడ్పడాలని ఇంటర్ పోల్ ను ఈడీ కోరనుంది.