
ఈక్విటీ ఎంఎఫ్ పెట్టుబడులు రూ.9,429 కోట్లు
డిసెంబరు తరవాత ఇదే గరిష్ఠ స్థాయి
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఏప్రిల్ నెలలో రూ.9,429 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపడం సహా ఫండ్ హౌస్‌లు మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తీసుకున్న పలు చర్యలు ఇన్వెస్ట్‌మెంట్ల పెరుగుదలకు కారణంగా ఉన్నాయి. రిడంప్షన్లతో పోలిస్తే ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి పెట్టుబడుల ఇన్‌ఫ్లో పెరుగుతూ రావడం వరసగా ఇది 13వ నెల. ఎందుకంటే ఇన్వెస్టర్లు గతేడాది మార్చిలో ఏకంగా రూ.1,370 కోట్లమేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
ఆ తరవాత నుంచి పెట్టుబడుల ఇన్‌ఫ్లో పెరిగినట్లు యాంఫీ తెలియజేసింది. దీని ప్రకారం... ఈక్విటీ ఫండ్స్‌లోకి ఏప్రిల్ ఒక్క నెలలోనే నికరంగా రూ.9,429 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు నెలలో ఇవి రూ.8,216 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ తరవాత చూస్తే ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్‌లో పెట్టుబడులు రూ.10,103 కోట్లుగా ఉన్నాయి. కాగా గతేడాది ఏప్రిల్‌లో ఈక్విటీ ఎంఎఫ్‌ల పెట్టుబడులు రూ.4,438 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మ్యూచ్‌వల్ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.5.69 లక్షల కోట్లకు చేరినట్లు కూడా యాంఫీ తెలియజేసింది.