పోర్టు బెర్త్‌లపై ప్రై‘వేటు’
♦ బెర్త్‌ల నిర్మాణానికి వేసిన ప్రణాళికలు ఢమాల్
♦ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయామంటున్న కంపెనీలు
♦ ఒక్క విశాఖ పోర్టులోనే రూ.1500 కోట్ల ప్రాజెక్టులపై ప్రభావం
♦ ఒప్పంద నిబంధనలే ప్రధాన కారణం
సాక్షి, విశాఖపట్నం: రేవుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలో ఒక నిబంధన కారణంగా రేవుల్లో బెర్తులు మూసివేతకు సిద్ధమవుతున్నాయి. యూరప్ దేశాలలో 40% సరకు రవాణా నౌకలపై జరుగుతుంటే మన దేశంలో 7% మాత్రమే జరుగుతోంది. నిజానికి రోడ్డు రవాణాకు అయ్యే ఖర్చులో దాదాపు సగం ఖర్చుకే నౌకలపై తరలించవచ్చు. పైగా పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరించాలంటే ఖర్చుతోపాటు భూ సమస్యలు తలెత్తుతాయి. నౌకామార్గానికి అలాంటి ఇబ్బందులు ఉండవు.
దీంతో పోర్టులను అభివృద్ధి చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దాని కోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. కానీ ఒప్పందంలో ఒక నిబంధన వల్ల మొత్తం ప్రాజెక్టులన్నీ అటకెక్కించాల్సి వస్తోంది. బెర్త్‌ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం ఓ నిబంధన పెట్టింది. బెర్త్‌ను ఏ ప్రయోజనం కోసం నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నారో దానికి మాత్రమే వినియోగించాలనే షరతు ఇప్పుడు సమస్యగా మారింది.
ఉదాహరణకు ఐరన్ ఓర్ బెర్త్‌ను నిర్మిస్తే ఐరన్ ఓర్ మాత్రమే హ్యాండ్లింగ్ చేయాలి. కోల్‌గానీ, ఆహార ఉత్పత్తులుగానీ, ఎరువులుగానీ ఏదీ చేయకూడదు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇప్పుడు ఐరన్ ఓర్, బొగ్గు దిగుమతుల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో బెర్త్‌లను ఇతర అవసరాలకు వినియోగించుకుంటే తప్ప కంపెనీలు మనుగడ సాగించలేని పరిస్థితి.
లక్ష్యం నెరవేరేదెలా?
దేశంలోని పదమూడు మేజర్ పోర్టులలో విశాఖ పోర్టు ఒకటి. అంతేకాదు దేశంలో ఇది రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం విశాఖ పోర్టు ఇన్నర్ హార్బర్‌లో 18, అవుటర్‌లో 6 బెర్త్‌లు ఉన్నాయి. ఇ1 బెర్త్ నుంచి థర్మల్ కోల్‌ను దిగుమతి చేస్తున్నారు. ఓఆర్ 1,2 బెర్త్‌ల ద్వారా పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్‌ను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. అవుటర్‌లో ఎస్‌పిఎం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. పోర్టు సామర్ధ్యం 65 మిలియన్ టన్నులు కాగా దానిని 150 మిలియన్ టన్నులకు పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం 6 బెర్తులను పోర్టు ఆధునీకరిస్తుండగా, నాలుగు బెర్తులను పీపీపీ పద్ధతిలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ.1500 కోట్లు. ఇవి పూర్తయితే తప్ప పోర్టు అనుకున్న లక్ష్యం నెరవేరదు.
కంపెనీలు కుదేలు: ప్రస్తుతం కోల్, ఐరన్ హ్యాండ్లింగ్‌కు అడ్డంకులు ఉండటంతో కంపెనీలు కుదేలవుతున్నాయి. దీంతో బెర్త్‌లు నిర్మించడంపై పునరాలోచనలో పడి రూ.1500 కోట్ల ప్రాజెక్టులన్నిటినీ నిలిపివేశాయి. ఇప్పటికే రూ.350 కోట్లతో కోల్ హ్యాండ్లింగ్ బెర్త్ నిర్మించిన అదానీ కంపెనీ ఆరు నెలల తర్వాత దానిని మూసేసింది. రూ.600 కోట్లతో ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ బెర్త్ నిర్మించిన వేదాంత సంస్థ తాజాగా దాన్ని మూసేయడానికి సిద్ధపడుతోంది. ఒకవేళ బెర్త్‌లు నిర్మిస్తే భవిష్యత్‌లో అప్పటి అవసరానికి అనుగుణంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ముందుకు వెళతామని కంపెనీలంటున్నాయి.