అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్, ఈక్విటీ మార్కెట్ ధోరణి పసిడి భవితను సమీప భవిష్యత్తులో నిర్దేశించనున్నాయనేది నిపుణుల విశ్లేషణ. డాలర్ బలహీనతతో అక్టోబర్ 13వ తేదీతో ముగిసిన వారంలో న్యూయార్క్ కమోడిటీ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,305 డాలర్ల స్థాయికి ఎగిసిన పసిడి మళ్లీ వెనక్కు తగ్గింది.
కీలక మద్దతయిన 1,305 స్థాయిని కోల్పోయి 24 డాలర్ల నష్టంతో 1,282కు చేరింది. అక్టోబర్ 20వ తేదీతో ముగిసిన వారంలో డాలర్ మళ్లీ బలోపేతం కావడం ఇందుకు ప్రధాన కారణం. ఈ వారంలో డాలర్ ఇండెక్స్ తిరిగి 93.67 స్థాయికి చేరడం గమనార్హం. అమెరికాలో పన్ను సంస్కరణలు, వృద్ధి మెరుగుదల అంచనాలు డాలర్ బలోపేతానికి కారణం.
ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలతో కూడిన 2018 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు ప్రణాళికను సెనేట్ ఆమోదించటం డాలర్, ఈక్విటీలకు బలాన్నిచ్చింది. అయితే పన్ను కోతలకు సంబంధించి ఇంకా తుది నిర్ణయాలను చూడాల్సి ఉంది.
పసిడి బలహీనతకే ఎక్కువ ఓట్లు...
‘‘వచ్చే ఏడాది పన్ను కోతకు 75 శాతం అవకాశం ఉందని మార్కెట్లు భావిస్తున్నాయి. ఇది పసిడికి ప్రతికూలం’’ అని ఫారెక్స్ లైవ్.కామ్‌కు చెందిన కరెన్సీ వ్యూహకర్త ఆడమ్ బుటన్ పేర్కొన్నారు. పసిడి బులిష్ ట్రెండ్ సమీప కాలంలో కష్టమేనని తాను భావిస్తున్నట్లు ఫారెక్స్.కామ్ టెక్నికల్ అనలిస్ట్ ఫవాద్ రజాక్‌దా చెప్పారు.
ఈక్విటీల అధిక విలువలు, పటిష్ట డాలర్‌ను దీనికి కారణంగా ఆయన పేర్కొన్నారు. పసిడి 1,300 డాలర్ల లోపునకు పడిపోతోందీ అంటే, సమీప భవిష్యత్తులో మరింత బలహీనానికి ఇది సంకేతమనీ ఆయన విశ్లేషించారు. ఇక వచ్చేవారం యూరోపియన్ యూనియన్ సెంట్రల్‌బ్యాంక్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పరపతి విధాన నిర్ణయాలు డాలర్‌పై, అందుకు అనుగుణంగా పసిడిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నా యి.
అమెరికా ఫెడ్ రేటు పెంపు ఖాయమంటూ వస్తున్న సంకేతాలు డాలర్ బలానికి, పసిడి బలహీనతకు దీర్ఘకాలం లో దారితీసే అంశాలుగా వారి అభిప్రాయం. అంతర్జాతీయ ఉద్రిక్తతలు పసిడికి స్వల్పకాలమే బూస్ట్‌నివ్వగలవు తప్ప, దీర్ఘకాలంలో ఇది సాధ్యపడదని విశ్లేషకుల అభిప్రాయం.
దేశీయంగా చూస్తే...: 20వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశంలో పసిడి కదిలింది. ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో పసిడి వారం వారీగా రూ.296 తగ్గి రూ. 29,554కు చేరింది. ఇక 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.180 తగ్గి రూ. 29,645కు దిగింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పడిపోయి రూ. 29,495కు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ. 425 తగ్గి రూ.39,430కి పడింది.
Comments
Please login to add a commentAdd a comment