గత కొద్ది రోజులుగా భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐఎస్) భారీ మొత్తంలో ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్క ఏప్రిల్ నెలలో రూ.5,208.50 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్‌ఐఐఎస్ అమ్మేశారు. దేశీయ మార్కెట్లు మార్చిలో ఉన్న కనిష్ట స్థాయి నుంచి ఏప్రిల్‌లో 23 శాతం ర్యాలీ చేసినప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత క్షీణించి ఏప్రిల్16 నాటికి రూ.76.87కు చేరింది.మార్చి 2 నుంచి ఏప్రిల్ 16 నాటికి రుపాయి విలువ 5.7 శాతం పడిపోయింది. ఏప్రిల్‌లో మొత్తంగా నిఫ్టీ, సెన్సెక్స్‌లలో 14 శాతం పెరుగుదల కనిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లు వరుసగా 13.02 శాతం, 16.93 శాతం పెరిగి రెండంకెల లాభాలను నమోదు చేశాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క మార్చినెలలో రూ.33.38 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో పెట్టుబడిదారుల సంపద రూ.15.92 లక్షల కోట్లకు పెరిగింది.
24 సెక్టార్‌లలో భారీ విక్రయాలు..
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్) డేటా ప్రకారం బీఎస్‌ఈలో 35 సెక్టార్‌లు ఉంటే వాటిలో 24 సెక్టార్‌లలోని ఫండ్స్‌ను విదేశీ పెట్టుబడిదారులు విక్రయాలు జరిపారు. మిగతా 8 సెక్టార్లను వారు పాజిటివ్‌గా చూస్తున్నారని ఈ డేటా చెబుతోంది. ఫార్మాసూటికల్స్ అండ్ బయోటెక్నలాజీ సెక్టార్‌లో భారీగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ నెలలో ఈ సెక్టార్ నుంచి రూ.1,942 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. 2020 ఏడాది మొదటి నుంచి ఇప్పటిదాక ఈ రంగం అత్యధిక పనితీరు కనబరిచినప్పటీకీ ఈ సెక్టార్ నుంచి ఫండ్స్ వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. గత కొన్నేళ్లుగా కనిష్టాల్లో ట్రేడ్ అవుతున్న ఫార్మా ఇండస్ట్రీ షేర్లు కోవిడ్-19 ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుండడంతో మార్చి నుంచి ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఏప్రిల్ నాటికి వార్షిక ప్రాతిపదికన బీఎస్‌ఈ హెల్త్‌కేర్ ఇండెక్స్ 14.17 శాతం పెరిగింది. ఇదే సమయంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ 18 శాతానికిపైగా క్షీణించింది.
ఆటో సెక్టార్‌లో ..
ఇతర రంగాలైన ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ (రూ.1,923 కోట్లు), సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్(రూ.1,278 కోట్లు),టెక్స్‌టైల్స్ అపరెల్స్ అండ్ యాక్సరీస్(రూ.1,073కోట్లు),యుటిలిటీస్ (రూ.1,005 కోట్లు),కన్జూమర్ డ్యూరబుల్స్(రూ.379 కోట్లు), హెల్త్‌కేర్ సర్వీసెస్ (రూ.329 కోట్లు), మీడియా (రూ.174కోట్లు) ఫుడ్ ,బేవరేజస్ అండ్ టొబాకో(రూ.112 కోట్లు) పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. గృహ,వ్యక్తిగత అవసరాల ఉత్పత్తుల రంగం ఎఫ్‌ఐఐఎస్‌ల దృష్టిలో మొదటి స్థానంలో ఉంది. ఏప్రిల్ నెలలో ఈ రంగంలో రూ.2,816 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో రూ.1,320 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయితే ఏప్రిల్ నెలలో ఈ సెక్టార్‌లోని రూ.9,764 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లీ పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment