బ్యాడ్‌బ్యాంక్‌ ఏర్పాటుపై చర్చిస్తున్నాం | Finance Ministry debating bad bank: Arun Jaitley | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌బ్యాంక్‌ ఏర్పాటుపై చర్చిస్తున్నాం

Published Mon, Jun 12 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

బ్యాడ్‌బ్యాంక్‌ ఏర్పాటుపై చర్చిస్తున్నాం

బ్యాడ్‌బ్యాంక్‌ ఏర్పాటుపై చర్చిస్తున్నాం

న్యూఢిల్లీ: తాజా ఆర్థిక సర్వే ప్రతిపాదించిన రెండు వినూత్న సూచనలు... ‘సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ)’, ‘బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటు’ ఈ రెండింటిపై చర్చిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. యూబీఐ అనేది ప్రస్తుతానికి ఆచరణ సాధ్యం కాని విధానమని పేర్కొన్న ఆయన అందుకు రాజకీయ పరిమితులు కారణంగా పేర్కొన్నారు. ఐఐటీ, ఢిల్లీలో టీచర్ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ... ‘‘ఈ ఏడాది ఆర్థిక సర్వే ఇప్పుడున్న మొత్తం సబ్సిడీలకు ప్రత్యామ్నాయంగా సార్వత్రిక కనీస ఆదాయం అందించాలని, ఇది పేదరికంలో ఉన్న వారిని వేగంగా బయటకు తీసుకురాగలదని పేర్కొంది.

 అలాగే, బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటు చేసి బ్యాంకుల ఎన్‌పీఏలు అన్నింటినీ దానికి బదలాయించాలని, అప్పుడు బ్యాంకులు తమ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టగలవని ఆర్థిక సర్వే సూచించింది. యూబీఐకి నేను పూర్తిగా మద్దతిస్తున్నాను. కానీ, దేశ రాజకీయాల్లో ఉన్న పరిమితులను అర్థం చేసుకున్న తర్వాత నా ఆందోళన వారికి తెలియజేశాను. యూబీఐ ఆలోచనను ముందుకు తీసుకొస్తే అప్పుడు పార్లమెంటులో ప్రతిపక్షాలు సబ్సిడీలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తాయి. పైగా యూబీఐని కూడా తీసుకురావాలంటాయి. బడ్జెట్‌ పరంగా అది భరించలేనిది’’ అని జైట్లీ వివరించారు.

ఎన్‌పీఏలపై నేడు కీలక సమావేశం
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)ను వేధిస్తున్న మొండి బకాయిల (ఎన్‌పీఏల) సమస్యపై ఆయా బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం సమావేశం కానున్నారు. పీఎస్‌బీల ఎన్‌పీఏలు రూ.6 లక్షల కోట్లను దాటిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌పీఏల రికవరీని వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలతోపాటు, బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. ఎన్‌పీఏలపై ఈ ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న మొదటి సమీక్షా సమావేశం ఇదే. ఎన్‌పీఏలపై సత్వర, కఠిన చర్యలకు గాను కేంద్రం ఇటీవలే ఓ ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

 ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, ఎంఎస్‌ఈ రుణాలు, స్టాండప్‌ ఇండియా, ముద్రా యోజన తదితర ప్రధాన అంశాలు ఈ సమావేశపు అజెండాలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా ఆర్థిక సేవల విస్తృతి, అక్షరాస్యత, సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన ఉన్నట్టు పేర్కొంది. జూలై 1నుంచి జీఎస్టీ అమలు దృష్ట్యా బ్యాంకుల సన్నద్ధత, సైబర్‌ భద్రత, బ్యాంకు లావాదేవీల డిజిటైజేషన్, గ్రామీణాభివృద్ధి, సాగు, విద్యా రుణాలపైనా చర్చించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.

హైబ్రిడ్‌ కార్లపై జీఎస్టీ రేటు మారదు
హైబ్రిడ్‌ కార్లపై నిర్ణయించిన జీఎస్టీ రేటును సమీక్షించే అవకాశం లేదని ఆర్థిక మంత్రి జైట్లీ సంకేతమిచ్చారు. పన్ను అధికారుల అధ్యయన ఫలితాలకు, పరిశ్రమ డిమాండ్లకు మధ్య పొంతన లేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ హైబ్రిడ్‌ కార్లపై 28 శాతం జీఎస్టీ, 15 శాతం సెస్‌ కలిపి మొత్తం 43 శాతంగా ఖరారు చేసింది. ఇంధన సామర్థ్యం గల వాహనాలపై ఈ రేటు చాలా అధికమని, దీన్ని 18 శాతానికి తగ్గించాలని పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. ఆదివారం జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్‌ 133 వస్తువులపై రేట్లు తగ్గించాలన్న డిమాండ్లను పరిశీలించింది. చివరికి 66 వస్తువులపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ నిర్ణయించిన రేట్లు ప్రస్తుత రేట్ల కంటే తక్కువగానే ఉన్నాయని జైట్లీ పేర్కొన్నారు. ఇవే దాదాపుగా తుది రేట్లని స్పష్టం చేశారు. ఎవరో డిమాండ్‌ చేస్తే దాన్ని అమలు చేయాలని ఏమీ లేదన్నారు.

ఎందుకు పెరిగాయంటే...
అంచనాల కంటే తక్కువగానే పుత్తడిపై జీఎస్‌టీ రేటు ఖరారు కావడంతో టైటాన్‌ షేర్‌ 11 శాతం దూసుకుపోయింది. జైడస్‌ క్యాడిలా తయారు చేస్తోన్న మెసలమైన్‌ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో క్యాడిలా హెల్త్‌కేర్‌ 9 శాతం పెరిగింది.  రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీఓకు రానున్నదన్న వార్తలతో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్‌ 7 శాతం ఎగసింది. ఇటీవల పతనం కారణంగా ఆకర్షణీయంగా ఉన్న ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో దివిస్‌ల్యాబ్, సిప్లా షేర్లు 4–5 శాతం రేంజ్‌లో పెరిగాయి.

ఎందుకు తగ్గాయంటే...
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను బ్రోకరేజ్‌ సంస్థలు ఫిచ్‌ రేటింగ్స్, మూడీస్‌ తగ్గించడంతో గత వారం కూడా ఆర్‌కామ్‌ నష్టాలు కొనసాగాయి. అమెరికాతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల్లో నష్టాలు రావచ్చంటూ గెయిల్‌ రేటింగ్‌ను మోతిలాల్‌ ఓస్వాల్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో గెయిల్‌ షేర్‌ 5 శాతం పతనమైంది. ఐటీసీలో ఉన్న తన వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తల కారణంగా ఐటీసీ షేర్‌ 4 శాతం నష్టపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement