UBI
-
మరో బ్యాంకింగ్ మెర్జర్‌కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం తరువాత మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులతో రెండవ దఫా విలీన చర్చలు జరుపుతోందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుది చర్చల అనంతరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విలీన ప్రక్రియకోసం ఎంతో కాలం వేచి వుండాలని తాము భావించడం లేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా, మూడవ త్రైమాసికంలో విలీనం ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు చెప్పారు. కాగా విజయ, దెనా, బీవోబీ విలీన ప్రక్రియ గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే. -
యూబీఐలో రూ.12 కోట్లు మాయం
కరీంనగర్‌క్రైం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి రూ.12 కోట్లు మాయమవడం కలకలం రేపింది. పారిశ్రామికవేత్తలమని పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులను అప్పనంగా డబ్బులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆడిటింగ్‌లో భాగంగా గురువారం తనిఖీలు నిర్వహించడంతో ఇది వెలుగుచూసింది. కరీంనగర్ యూబీఐ బ్రాంచ్ మేనేజర్‌గా సురేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సురేష్‌కుమార్‌కు కామారెడ్డికి చెందిన రాజుతో పరిచయం ఉంది. అతని ద్వారా ముంబైకి చెందిన సౌమిత్ రంజన్ జైన్, మధ్యప్రదేశ్‌లోని జగదల్పూర్కు చెందిన మనోజ్‌కుమార్ శుక్లాలు వ్యాపారవేత్తలుగా మేనేజర్‌తో పరిచయం చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత రంజన్‌జైన్ తనకు డబ్బులు అవసరం ఉందని, బ్యాంక్ నుంచి రూ.5 కోట్లు ఇస్తే.. అదనంగా కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మేనేజర్.. 2018 అక్టోబర్‌లో మొదటి దఫా రూ.5 కోట్లు ఇచ్చాడు. ఫిబ్రవరిలో రెండో వ్యక్తి మనోజ్ శుక్లా కూడా తనకూ అవసరం ఉందని అడగడంతో అతనికి మరో రూ.7 కోట్లు తీసుకొని వెళ్లి అప్పగించారు. అనంతరం వారు పత్తా లేకుండా పోయారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ నుంచి వచ్చిన తనిఖీ బృందం పరిశీలించగా.. లెక్కల్లో తేడాలు రావడంతో అనుమానం వచ్చింది. దీంతో అన్ని రకాల రికార్డులు పరిశీలించగా.. రూ. 12 కోట్లకు సంబంధించిన సమాచారం లేదు. బ్యాంక్ మేనేజర్‌ను విచారించగా తాను ఇద్దరికి.. రూ.12 కోట్లు ఇచ్చినట్లు తెలిసింది. అన్నీ అనుమానాలే.. కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో 28 బ్రాంచ్‌లకు చెందిన నగదు నిల్వలను పర్యవేక్షిస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న సురేష్‌కుమార్ చాలా కాలంపాటు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి కేవలం కొద్ది రోజుల క్రితం పరిచయమైన ఇద్దరికి తాను రూ.12 కోట్లు ఇచ్చానని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ అధికారులు రంగంలోకి దిగారని తెలిసింది. ఈ విషయమై బ్యాంక్ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
రెండేళ్లలో బ్యాంకు ఖాతాలకు నేరుగా సొమ్ము
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాకు నెలానెలా కొంత మొత్తం ప్రభుత్వం సమకూర్చే విధానం కార్యాచరణకు నోచుకోనుంది. రానున్న రెండేళ్లలో సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) పథకాన్ని ఒకటి రెండు రాష్ట్రాలైనా అమలు చేస్తాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నా పెద్దా, ధనిక..పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కనీస మొత్తం చెల్లించాలని 2016-17 ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. కాగా,వచ్చే రెండేళ్లలో ఒకట్రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా యూబీఐని అమలుచేస్తాయని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతిలో కూరుకుపోవడంతో వాటితో పోలిస్తే సార్వత్రిక కనీస రాబడి కింద అందే మొత్తం పౌరుల కనీస అవసరాలను చాలావరకూ తీర్చవచ్చనే అభిప్రాయం నెలకొంది. ఒకటి, రెండు రాష్ట్రాలు ఈ పథకాన్ని తలకెత్తుకున్నా వాటి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా యూబీఐని దశలవారీగా విస్తరిస్తారు. -
యూనియన్ బ్యాంక్ లాభం 30 శాతం డౌన్
ముంబై: మొండి బాకీలు, భారీ ప్రొవిజనింగ్ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 117 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్థులు ఏకంగా 10.16 శాతం నుంచి 12.63 శాతానికి ఎగిశాయి. నికర నిరర్థక ఆస్తులు 6.16 శాతం నుంచి 7.47 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం పెరిగినప్పటికీ మొండిబాకీలకు కేటాయింపుల వల్ల వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం క్షీణించిందని బ్యాంక్ సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రుణాల్లో మరో 4 శాతం కొత్తగా మొండి బాకీలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరో 10 ఎన్పీఏ ఖాతాలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు పంపాలని యోచిస్తున్నట్లు వివరించారు. -
బ్యాడ్‌బ్యాంక్ ఏర్పాటుపై చర్చిస్తున్నాం
న్యూఢిల్లీ: తాజా ఆర్థిక సర్వే ప్రతిపాదించిన రెండు వినూత్న సూచనలు... ‘సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ)’, ‘బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు’ ఈ రెండింటిపై చర్చిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. యూబీఐ అనేది ప్రస్తుతానికి ఆచరణ సాధ్యం కాని విధానమని పేర్కొన్న ఆయన అందుకు రాజకీయ పరిమితులు కారణంగా పేర్కొన్నారు. ఐఐటీ, ఢిల్లీలో టీచర్ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ... ‘‘ఈ ఏడాది ఆర్థిక సర్వే ఇప్పుడున్న మొత్తం సబ్సిడీలకు ప్రత్యామ్నాయంగా సార్వత్రిక కనీస ఆదాయం అందించాలని, ఇది పేదరికంలో ఉన్న వారిని వేగంగా బయటకు తీసుకురాగలదని పేర్కొంది. అలాగే, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేసి బ్యాంకుల ఎన్పీఏలు అన్నింటినీ దానికి బదలాయించాలని, అప్పుడు బ్యాంకులు తమ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టగలవని ఆర్థిక సర్వే సూచించింది. యూబీఐకి నేను పూర్తిగా మద్దతిస్తున్నాను. కానీ, దేశ రాజకీయాల్లో ఉన్న పరిమితులను అర్థం చేసుకున్న తర్వాత నా ఆందోళన వారికి తెలియజేశాను. యూబీఐ ఆలోచనను ముందుకు తీసుకొస్తే అప్పుడు పార్లమెంటులో ప్రతిపక్షాలు సబ్సిడీలను కొనసాగించాలని డిమాండ్ చేస్తాయి. పైగా యూబీఐని కూడా తీసుకురావాలంటాయి. బడ్జెట్ పరంగా అది భరించలేనిది’’ అని జైట్లీ వివరించారు. ఎన్పీఏలపై నేడు కీలక సమావేశం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)ను వేధిస్తున్న మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్యపై ఆయా బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం సమావేశం కానున్నారు. పీఎస్‌బీల ఎన్పీఏలు రూ.6 లక్షల కోట్లను దాటిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్పీఏల రికవరీని వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలతోపాటు, బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. ఎన్పీఏలపై ఈ ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న మొదటి సమీక్షా సమావేశం ఇదే. ఎన్పీఏలపై సత్వర, కఠిన చర్యలకు గాను కేంద్రం ఇటీవలే ఓ ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, ఎంఎస్ఈ రుణాలు, స్టాండప్ ఇండియా, ముద్రా యోజన తదితర ప్రధాన అంశాలు ఈ సమావేశపు అజెండాలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా ఆర్థిక సేవల విస్తృతి, అక్షరాస్యత, సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ఉన్నట్టు పేర్కొంది. జూలై 1నుంచి జీఎస్టీ అమలు దృష్ట్యా బ్యాంకుల సన్నద్ధత, సైబర్ భద్రత, బ్యాంకు లావాదేవీల డిజిటైజేషన్, గ్రామీణాభివృద్ధి, సాగు, విద్యా రుణాలపైనా చర్చించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ రేటు మారదు హైబ్రిడ్ కార్లపై నిర్ణయించిన జీఎస్టీ రేటును సమీక్షించే అవకాశం లేదని ఆర్థిక మంత్రి జైట్లీ సంకేతమిచ్చారు. పన్ను అధికారుల అధ్యయన ఫలితాలకు, పరిశ్రమ డిమాండ్లకు మధ్య పొంతన లేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ హైబ్రిడ్ కార్లపై 28 శాతం జీఎస్టీ, 15 శాతం సెస్ కలిపి మొత్తం 43 శాతంగా ఖరారు చేసింది. ఇంధన సామర్థ్యం గల వాహనాలపై ఈ రేటు చాలా అధికమని, దీన్ని 18 శాతానికి తగ్గించాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ఆదివారం జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ 133 వస్తువులపై రేట్లు తగ్గించాలన్న డిమాండ్లను పరిశీలించింది. చివరికి 66 వస్తువులపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ నిర్ణయించిన రేట్లు ప్రస్తుత రేట్ల కంటే తక్కువగానే ఉన్నాయని జైట్లీ పేర్కొన్నారు. ఇవే దాదాపుగా తుది రేట్లని స్పష్టం చేశారు. ఎవరో డిమాండ్ చేస్తే దాన్ని అమలు చేయాలని ఏమీ లేదన్నారు. ఎందుకు పెరిగాయంటే... అంచనాల కంటే తక్కువగానే పుత్తడిపై జీఎస్టీ రేటు ఖరారు కావడంతో టైటాన్ షేర్ 11 శాతం దూసుకుపోయింది. జైడస్ క్యాడిలా తయారు చేస్తోన్న మెసలమైన్ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో క్యాడిలా హెల్త్‌కేర్ 9 శాతం పెరిగింది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓకు రానున్నదన్న వార్తలతో రిలయన్స్ క్యాపిటల్ షేర్ 7 శాతం ఎగసింది. ఇటీవల పతనం కారణంగా ఆకర్షణీయంగా ఉన్న ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో దివిస్ల్యాబ్, సిప్లా షేర్లు 4–5 శాతం రేంజ్లో పెరిగాయి. ఎందుకు తగ్గాయంటే... రిలయన్స్ కమ్యూనికేషన్స్ క్రెడిట్ రేటింగ్‌ను బ్రోకరేజ్ సంస్థలు ఫిచ్ రేటింగ్స్, మూడీస్ తగ్గించడంతో గత వారం కూడా ఆర్‌కామ్ నష్టాలు కొనసాగాయి. అమెరికాతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల్లో నష్టాలు రావచ్చంటూ గెయిల్ రేటింగ్‌ను మోతిలాల్ ఓస్వాల్ డౌన్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో గెయిల్ షేర్ 5 శాతం పతనమైంది. ఐటీసీలో ఉన్న తన వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తల కారణంగా ఐటీసీ షేర్ 4 శాతం నష్టపోయింది. -
సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే యూబీఐ
అహ్మదాబాద్: ఆర్థిక సర్వే ప్రతిపాదించిన సార్వజనీన ప్రాథమిక ఆదాయ (యూనివర్శల్ బేసిక్ ఇన్‌కం-యూబీఐ) పథకం అమలు ప్రస్తుత సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే ఉంటుందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ప్రకటించారు. ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ ప్రాజెక్టుల విరమణ అనంతరం మాత్రమే యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం పథక ప్రతిపాదనను అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. అహ్మదాబాద్ ఐఐఎం-ఏలో శనివారం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన సుబ్రమణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వే విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ యూబీఐ కార్యక్రమం అమలు చాలా ఖర్చుతో కూడుకున్నదనీ, ఇప్పటికే సంక్షేమ పథకాల కార్యక్రమాల ఖర్చును ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూబీఐ పథకాన్ని జోడించలేమని చెప్పారు. అలా చేస్తే ప్రభుత్వ ఆర్ధికపరిస్థితి పతనంవైపు వెళ్తుందని సుబ్రమణ్యం తెలిపారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు ..లబ్దిదారులు చేరడం లేదన్నారు. అయితే భారతదేశంలో పేదల అభ్యున్నతికోసం నిర్దేశించిన యూబీఐ పథకం ఈ సమస్యల్ని అధిగమిస్తూ సరికొత్త పద్ధతుల్లో ప్రారంభిచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథక ఫలాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా చేయడంమే దీని ప్రత్యేకత అని చెప్పారు. గత (స్వతంత్రం వచ్చిన తర్వాత)30-40 సంవత్సరాల్లో చేయలేని పనికి తాము పూనుకున్నామన్నారు. పేదరిక నిర్మూలనలో ఇది భారీ చారిత్రక సవాలు అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు పేదల చేతికి (బ్యాంకు ఖాతాల) డబ్బు అందితే వారు విచ్చలవిడిగా ఖర్చుచేసే అవకాశం ఉందనీ, అదే డబ్బు స్త్రీల కిస్తే దుర్వినియోగయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అభిప్రయాపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు మందగించగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వృద్దిరేటు వేగంగా పుంజుకోవడం గమనించాలన్నారు. అయితే మన దేశంలో ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఆశ్చర్యకరంగా గత 15-20 సంవత్సరాలలో వెనుకబడిన రాష్ట్రాలకుగా పిలుస్తున్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం మందగిస్తోంటే.. అభివృద్ది చెందిన రాష్ట్రాలు శరవేంగా ముందుకు వెళుతున్నాయని చెప్పారు. దేశంలో రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలను భారీగా పెరుగుదుల ఇది సూచిక అన్నారు కాగా పేదలు తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు అవసరమయ్యే కనీసస్థాయి నగదును ప్రభుత్వం అందించాలని ముఖ్య ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే సూచించింది. ప్రస్తుత రాయితీల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసి, వాటిస్థానంలో యూబీఐ ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. -
పేదరిక నిర్మూలనకు కొత్త రూటు
న్యూఢిల్లీ: దేశంలో పేదరికం నిర్మూలన లక్ష్యంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తాజా ఎకనమిక్ సర్వేలో ‘సార్వత్రిక కనీస ఆదాయం’ (యూబీఐ) అనే ఒక కొత్త ఆలోచనకు తెరతీశారు. ‘‘ప్రతి కంటి నుంచీ ప్రతి కన్నీటి చుక్కనూ తుడవాలి’’ అన్న మహాత్ము ని ఆశయ సాధనను ఎకనమిక్ సర్వే ప్రస్తావించింది. పేదలకు కొంత కనీస ఆదాయం తప్పనిసరిగా లభించేలా(నగదు బదిలీ) చర్యలు తీసుకోవడమే క్లుప్తంగా ఈ యూబీఐ లక్ష్యం. సబ్సిడీలను తొలగించడం.. ప్రస్తుత పథకాలకు ప్రత్యామ్నాయంగా యూబీఐ ఆలోచనకు కేంద్రం శ్రీకారం చుట్టింది. విజయవంతం కావాలంటే..? ఈ పథకం విజయవంతానికి రెండు అంశాలు కీలకమని పేర్కొన్న సర్వే... ఇందులో ఒకటి జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం)అని పేర్కొంది. మరొకటి దీనికి అయ్యే వ్యయంపై కేంద్ర–రాష్ట్రాల మధ్య చర్చలని వివరించింది. ఎంత ఖర్చవుతుంది? సర్వే అంచనాల ప్రకారం తాజా పథకం పేదరికాన్ని 0.5 శాతానికి తగ్గిస్తుంది. అయితే స్థూల దేశీయోత్పత్తిలో ఇందుకోసం అయ్యే వ్యయం 4 శాతం నుంచి 5 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం మధ్య తరగతికి ఇస్తున్న సబ్సిడీలు, ఆహారం, పెట్రోలియం, ఎరువుల సబ్సిడీల విలువ జీడీపీలో దాదాపు 3 శాతంగా ఉంది. టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం– స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశ జనాభాలో 70 శాతం పేదరికం ఉంటే, 2011–12 నాటికి 22 శాతానికి తగ్గింది. అయితే ప్రతి ఒక్కరి కన్నీరూ తుడవాలన్న లక్ష్యంగా తాజా పథకాన్ని ప్రవేశపెట్టాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇప్పుడు ఎన్నో లొసుగులు..: ప్రస్తుత పేదరిక నిర్మూలనా, పేదల సంక్షేమ పథకాల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు సర్వే వివరించింది. తాజా యూబీఐ ద్వారా పేదలకు భౌతికంగా, మానసికంగా అపార ప్రయోజనాలు, భరోసా కల్పించాలన్నది లక్ష్యమని సర్వే పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్ ఉద్యోగాల కల్పనకు విఘాతమని వస్తున్న ఆందోళనలకు సైతం యూబీఐ పరిష్కారం చూపే విధంగా ఉండాలన్నది సర్వే ఉద్దేశం. ఇప్పటికే ఫిన్లాండ్లో... ఇప్పటికే ఫిన్లాండ్ దేశంలో పైలట్ ప్రాతిపదికన ఈ తరహా పథకం అమలు జరుగుతోంది. మిగిలిన కొన్ని దేశాలూ దీనిని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఏడాది స్విట్జర్లాండ్ ఓటర్లు ఈ తరహా పథకాలను తిరస్కరించారు. ఆహారం, సేవలను అందించడం లేదా కూపన్లు ఇవ్వడం లేదా ప్రత్యక్షంగా డబ్బు ఇవ్వడం వంటి అంశాలు తాజా పథకంలో ఇమిడి ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. -
రేటు కోత బాటలో బీఓబీ.. యూబీఐ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు తమ మార్జినల్ కాస్ట్ ఫండ్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను గురువారం తగ్గించాయి. వివిధ బ్యాంకు నిర్ణయాలు చూస్తే... బీఓబీ..: రుణ రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింది. జనవరి 7వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. కొత్త, రెన్యువల్ రుణ అకౌంట్లు అన్నింటికీ తాజా నిర్ణయం వర్తిస్తుందని ప్రకటన పేర్కొంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.10%కి తగ్గుతుంది. నెల కాలపరిమితి రేటు 8.15%గా ఉంది. మూడు నెలల రేటు 8.95% నుంచి 8.20 శాతానికి చేరింది. ఏడాది రేటు 70 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 9.05% నుంచి 8.35 శాతానికి చేరింది. యూబీఐ కూడా 0.90 శాతం కోత ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కూడా తన రుణ రేటును 0.60–0.90 శాతం శ్రేణిలో తగ్గించింది. ఆరవ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏడాది రుణ రేటు 0.60 శాతం తగ్గి, 8.8 శాతానికి చేరింది. నెలవారీ రుణ రేటు 0.90 శాతం తగ్గి 8.35 శాతానికి చేరింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో బ్యాంకుల వద్ద భారీ ద్రవ్య లభ్యత పరిస్థితి నెలకొనడంతో ఎస్బీఐ సహా పలు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇదే దారిపట్టాయి. -
మాట్లాడే కంప్యూటర్...
కంప్యూటర్లో సమాచారం వెతుక్కోవడం మనమందరం చేసే పనే. అయితే కావాల్సిన సమాచారం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మాత్రం కొంచెం శ్రమకోర్చాల్సి ఉంటుంది. కీవర్డ్లు గూగుల్ సెర్చింజిన్‌లో టైప్ చేయాలి, వచ్చే రిజల్ట్స్ చదివి తెలుసుకోవాలి. ఈ బాదరబందీలేవీ లేకుండా నేరుగా మీక్కావలసిన విషయాన్ని తెలుసు కోవాలనుకుంటున్నారా? అయితే ఫొటోలో కనిపిస్తున్న ‘ఉబి’ మీ కోసమే. కెనడాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ పరికరం మానీటర్, కీబోర్డుల్లేని మాట్లాడే కంప్యూటర్. మీరు ప్రశ్న అడగడమే ఆలస్యం... నెట్మొత్తాన్ని జల్లెడ పట్టి... సమాధానాలు వెతికి వినిపిస్తుంది. -
ఎల్ఐసీ స్టాక్స్ పెట్టుబడులు 55,000 కోట్లకు పైనే!
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్లో రూ.55,000 కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టనుంది. సంస్థ చైర్మన్ ఎస్కే రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల వాటా విక్రయాల్లో కూడా ఇందులో కొంత మొత్తాన్ని వెచ్చించనున్నామని.. మొత్తంమీద ప్రస్తుత 2014-15లో తాము రూ.55 వేలకు పైగానే ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ రూ.51,000 కోట్ల విలువైన స్టాక్స్‌ను కొనుగోలు చేసింది. కేంద్రం తాజాగా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీల్లో ప్రభుత్వ వాటాల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఖజానాకు రూ.43,000 కోట్లు లభించవచ్చని అంచనా. అదేవిధంగా సెయిల్‌లో 5 శాతం, వైజాగ్ స్టీల్(ఆర్ఐఎన్ఎల్), హిందుస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్)లలో చెరో 10 శాతం చొప్పున వాటాలను విక్రయించే ప్రణాళికల్లో ఉంది. కాగా, బాండ్ మార్కెట్లో ఈ ఏడాది తమ పెట్టుబడులు రూ.2.5 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉందని కూడా రాయ్ పేర్కొన్నారు. -
మొండిబకాయిల పాపం ఇన్ఫీ సాఫ్ట్‌వేర్‌దే: యునెటైడ్ బ్యాంక్
న్యూఢిల్లీ: నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) మొత్తం భారీగా పెరిగినట్లుగా కనిపించడానికి లోపభూయిష్టమైన ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేరే కారణమని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆరోపించింది. కొన్ని విభాగాల్లో ఆస్తులను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్వేర్ విఫలమవుతోందని పేర్కొంది. కోర్ బ్యాంకింగ్ సేవల కోసం తమతో పాటు పలు బ్యాంకులు ఇన్ఫోసిస్ రూపొందించిన ఫినాకిల్ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నాయని స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈకి యూబీఐ తెలిపింది. అయితే, పునర్వ్యవస్థీకరించిన ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లు తదితర విభాగాల వివరాలను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్వేర్ పొరపాట్లు చేస్తోందని వివరించింది. ఇలాంటి పొరపాట్ల వల్లే భేషుగ్గా ఉన్న ఖాతాలను ఎన్పీఏలుగాను, ఎన్పీఏలను మంచి ఖాతాలుగానూ చూపించిందని యూబీఐ తెలిపింది. వివిధ త్రైమాసికాల్లో ఎన్పీఏలు భారీగా ఎగియడంపై సందేహాలు వ్యక్తం చేసిన ఆర్బీఐ.. యునెటైడ్ బ్యాంక్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్‌కి ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తమ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి లోపాలు లేవని, ఆర్బీఐ నిర్దేశాలకు అనుగుణంగానే అది పనిచేస్తుందని ఇన్ఫోసిస్ వర్గాలు స్పష్టం చేశాయి.