ఎల్‌ఐసీ స్టాక్స్ పెట్టుబడులు 55,000 కోట్లకు పైనే!
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఈ ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్లో రూ.55,000 కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టనుంది. సంస్థ చైర్మన్ ఎస్‌కే రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల వాటా విక్రయాల్లో కూడా ఇందులో కొంత మొత్తాన్ని వెచ్చించనున్నామని.. మొత్తంమీద ప్రస్తుత 2014-15లో తాము రూ.55 వేలకు పైగానే ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ రూ.51,000 కోట్ల విలువైన స్టాక్స్‌ను కొనుగోలు చేసింది.
కేంద్రం తాజాగా ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీల్లో ప్రభుత్వ వాటాల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఖజానాకు రూ.43,000 కోట్లు లభించవచ్చని అంచనా. అదేవిధంగా సెయిల్‌లో 5 శాతం, వైజాగ్ స్టీల్(ఆర్‌ఐఎన్‌ఎల్), హిందుస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్‌ఏఎల్)లలో చెరో 10 శాతం చొప్పున వాటాలను విక్రయించే ప్రణాళికల్లో ఉంది. కాగా, బాండ్ మార్కెట్లో ఈ ఏడాది తమ పెట్టుబడులు రూ.2.5 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉందని కూడా రాయ్ పేర్కొన్నారు.