రేటు కోత బాటలో బీఓబీ.. యూబీఐ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు తమ మార్జినల్ కాస్ట్ ఫండ్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను గురువారం తగ్గించాయి. వివిధ బ్యాంకు నిర్ణయాలు చూస్తే...
బీఓబీ..: రుణ రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింది. జనవరి 7వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. కొత్త, రెన్యువల్ రుణ అకౌంట్లు అన్నింటికీ తాజా నిర్ణయం వర్తిస్తుందని ప్రకటన పేర్కొంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.80 శాతం నుంచి 8.10%కి తగ్గుతుంది. నెల కాలపరిమితి రేటు 8.15%గా ఉంది. మూడు నెలల రేటు 8.95% నుంచి 8.20 శాతానికి చేరింది. ఏడాది రేటు 70 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 9.05% నుంచి 8.35 శాతానికి చేరింది.
యూబీఐ కూడా 0.90 శాతం కోత
ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కూడా తన రుణ రేటును 0.60–0.90 శాతం శ్రేణిలో తగ్గించింది. ఆరవ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏడాది రుణ రేటు 0.60 శాతం తగ్గి, 8.8 శాతానికి చేరింది. నెలవారీ రుణ రేటు 0.90 శాతం తగ్గి 8.35 శాతానికి చేరింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో బ్యాంకుల వద్ద భారీ ద్రవ్య లభ్యత పరిస్థితి నెలకొనడంతో ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇదే దారిపట్టాయి.